BJP: రఘునందన్‌రావు తప్ప.. ఎక్కడా కనిపించని హేమాహేమీల పేర్లు!

ఇంతకీ బీజేపీ టికెట్లకు సీనియర్లు దరఖాస్తు చేసుకోకపోవడానికి కారణమేంటి? సీనియర్లకు ఓ రూలు.. జూనియర్లకు ఓ రూలా.. లేక దరఖాస్తు ప్రక్రియ నామమాత్రమేనా?

BJP Telangana: బీజేపీ సీనియర్ల తీరు.. ఆ పార్టీ ఏ ఒక్కరికీ అర్థం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. సీనియర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) తప్ప.. పార్టీలో హేమాహేమీలుగా చెప్పే నాయకుల పేర్లు ఎక్కడా కనిపించడం లేదు. సుమారు 6 వేల దరఖాస్తులు వచ్చాయని బీజేపీ చెబుతుండగా.. కీలకనేతలు అయిన మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటలతో (Eatala Rajender) సహా ముఖ్యనేతల దరఖాస్తు ఒక్కటీ లేకపోవడం విశేషంగా చెబుతున్నారు. ఇంతకీ బీజేపీ టికెట్లకు సీనియర్లు దరఖాస్తు చేసుకోకపోవడానికి కారణమేంటి? సీనియర్లకు ఓ రూలు.. జూనియర్లకు ఓ రూలా.. లేక దరఖాస్తు ప్రక్రియ నామమాత్రమేనా? ఏంటి బీజేపీ రాజకీయం..? తెరవెనుక ఏం జరుగుతోంది?

మేమేంటి? కొత్తగా దరఖాస్తు చేసుకోవడమేంటి? అన్నట్లుంది తెలంగాణ బీజేపీ లీడర్ల తీరు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తిగా ఉన్నవారు ఏ నియోజకవర్గం టికెట్ కావాలో దరఖాస్తు చేసుకోవాలని హైకమాండ్ క్లియర్‌గా ఆదేశించినా.. లైట్‌గానే తీసుకున్నారు సీనియర్ నేతలు. ఈ నెల 4 నుంచి పదో తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే ముఖ్యనేతలు ఒక్కరు కూడా అసలు అటువైపే చూడలేదని చెబుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రమే దుబ్బాట టికెట్ కావాలంటూ దరఖాస్తు అందజేయడం బీజేపీలో చర్చకు దారితీస్తోంది.

ముఖ్య నేత దరఖాస్తు చేసుకోకపోవడంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బడా నేతలకు ఒక లెక్క, చోటా నేతలకు ఓ లెక్కా అంటూ ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజే సీనియర్ల నుంచి స్పందన కనిపించకపోవడంపై రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంత పెద్ద లీడర్లు అయినా పార్టీ నియమాలను కట్టుబడాల్సిందేనని చెప్పినా.. సీనియర్లు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

Also Read: చీకోటి ప్రవీణ్‌కు బీజేపీ ఊహించని షాక్.. పార్టీలో చేరుదామని వెళితే..

రాష్ట్ర బీజేపీలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. ఇందులో నలుగురు లోక్‌సభ సభ్యులు కాగా, మరొకరు యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, అరవింద్, సోయం బాబూరావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు చేసుకోలేదు. బండి సంజయ్, అరవింద్ ఈ సారి అసెంబ్లీకి పోటీచేస్తారని గతంలో ప్రచారం జరిగినా.. ఇప్పుడు వారిద్దరూ ఏ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపటం లేదు. ఐతే వారు ఎక్కడ నుండి పోటీ చేయాలనేది జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని.. అందుకే వారు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతోంది. ఐతే ప్రస్తుత శాసనసభ్యులు కూడా దరఖాస్తుల ప్రక్రియకు దూరంగా ఉండటంపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ సస్పెన్షన్‌లో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మరోసారి దుబ్బాక టికెట్ కావాలని దరఖాస్తు చేసుకోగా, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయాలని దరఖాస్తు వచ్చినప్పటికీ ఆయన నేరుగా ఆ దరఖాస్తు ఇవ్వలేదు.

Also Read: ఎవర్రా బానిసలు? ఆమెను ఒక్క మాట అన్నా పాపం తగులుతుంది- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు

ఇక కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అదే జిల్లాకు చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దరఖాస్తు చేసుకోలేదు. ఇదే బాటలో మాజీ ఎంపీలు వివేక్ వెంకట స్వామి, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో పాటు సీనియర్ నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకునేందుకు సముఖత చూపలేదు. దరఖాస్తుల అంశం ప్రస్తావించిన సమయంలో సీనియన్ నేతల నుండి నిర్లక్ష్యంగా సమాధానాలు వచ్చాయంటున్నారు. అప్లికేషన్ ఇస్తే తప్ప టికెట్ ఇవ్వరా అన్న ధోరణిలో ప్రశ్నిస్తుండటంతో కంగుతింటోంది రాష్ట్ర నాయకత్వం. పార్టీ జాతీయ నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దరఖాస్తు ప్రక్రియను లైట్ తీసుకోవడం ద్వారా బీజేపీలో క్రమశిక్షణపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీ నియమావళిపై నిక్కచ్చిగా ఉండే బీజేపీ.. దరఖాస్తు చేసుకోని నేతలకు టికెట్లు ఇస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు