జగ్గయ్యపేటలో సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, 16మందికి గాయాలు

ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Blast In Cement Factory : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 16మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్లాంట్ లో బాయిలర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా..
ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుండి పరిహారం అందేలా చూడాలన్నారు. కంపెనీతో పాటు ప్రభుత్వం నుంచి కూడా బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా నిలవాలని అధికారులు సూచించారు. గాయపడ్డ వారికి అందుతున్న వైద్యంపై అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం- ఆవుల గోవింద్, మృతుడు ఆవుల వెంకటేశ్ సోదరుడు
కంపెనీ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకోంది. మా ఊరి నుండి చూసినప్పుడు పెద్ద బూడిద లేచింది. కంపెనీలో హిందీ వాళ్ళు చనిపోయారని చెప్పారు. మా అన్నయ్య ఉన్నాడని నాకు తెలిసింది. సెక్యూరిటీని దాటుకుని ముందుకు వెళ్ళాను. మా అన్నయ్యతో పాటు మరో ఇధ్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో లిఫ్ట్ కూడా పని చేయలేదు. అదే పని చేస్తే ఎంతో కొంతమంది చిన్న చిన్న గాయాలతో బయటపడే వారు. హాస్పిటల్ కి తీసుకొచ్చాం. హాస్పిటల్ లో మా అన్నయ్య చనిపోయాడు. ఇంత ఘటన జరిగినా కంపెనీ వాళ్ళు ఎలా ఉంది అని కనీసం అడగలేదు. మా అన్నయ్య కుటుంబానికి న్యాయం జరగాలి.

10 రోజులుగా గ్యాస్ లీక్ అవుతున్నా పట్టించుకోలేదు..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఉంది. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం పూట ఈ ఘటన జరగ్గా, ఫ్యాక్టరీ వాళ్లు ఆలస్యంగా స్పందించారని బూదవాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో 16మందికి గాయాలయ్యాయి. ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా బాయిలర్ గ్యాస్ పైపు లీక్ అవుతోందని ఫ్యాక్టరీ యజమానులకు వర్కర్స్ చెప్పినా.. వారు పట్టించుకోలేదని, దాంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత కూడా బాధితులకు వెంటనే వైద్యం అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని వాపోయారు. విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో 8మందిని, మణిపాల్ ఆసుపత్రిలో 8మందిని చేర్చారు. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మరణించారు. మృతులను ఆవుల వెంకటేశ్, పరిటాల అర్జున్ గా గుర్తించారు. వీరిద్దరూ బూదవాడ గ్రామానికి చెందిన వారు.

Also Read : డ్రైనేజీలో పడిపోయిన బాలుడు.. 3 రోజుల తర్వాత అతడి మృతదేహం ఎలా దొరికిందో తెలుసా?