BRS Party: బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఆ మూడు స్థానాలు!

ఆశావహులు ప్రయత్నాలు చల్లారక.. టికెట్ దక్కించుకున్న నేతలకు నమ్మకం కుదరక గులాబీ పార్టీలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఫైనల్ చేసినా.. ఇంకా కన్ఫూజన్ ఎందుకు?

BRS Party- Medak : ప్రత్యర్థి పార్టీలను కంగుతినిపిస్తూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్‌కు (CM KCR) సొంత జిల్లా పరిస్థితులు మింగుడు పడటం లేదు. 115 సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్‌లో మూడు స్థానాలు తలనొప్పిగా మారాయి. అభ్యర్థులు ఖరారై పదిహేను రోజులు దాటినా.. టికెట్ల రచ్చ ఇంకా తగ్గక నేతలు హైరానా పడుతున్నారు. ఆశావహులు (BRS Aspirants) ప్రయత్నాలు చల్లారక.. టికెట్ దక్కించుకున్న నేతలకు నమ్మకం కుదరక గులాబీ పార్టీలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఫైనల్ చేసినా.. ఇంకా కన్ఫూజన్ ఎందుకు? ఆశావహుల ప్రయత్నాలకు పుల్‌స్టాప్ పడటం లేదు ఎందుకు?

సీఎం కేసీఆర్, ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్రావు సొంత జిల్లా ఉమ్మడి మెదక్. ఈ జిల్లాలో అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఐతే జిల్లా కేంద్రం మెదక్‌లోనే ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌కి వ్యతిరేకంగా అసమ్మతి నేత మైనంపల్లి రోహిత్ యువత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఎటువంటి అభివృద్ధి చేయలేదని పద్మా దేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఈసారి పద్మాదేవేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము పనిచేయమని బీఆర్ఎస్ నాయకులు కొందరు బహిరంగంగానే ప్రకటించారు. ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణల అంశం రచ్చ రచ్చగా మారగా.. దీని వెనకు బిఆర్ఎస్లోని ఓ వర్గమే ఉందంటూ ఆరోపించారు ఎమ్మెల్యే వర్గం నేతలు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే టికెట్‌కు ఎక్కడ ఎసరు వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు విపక్షం, మరో వైపు స్వపక్షం నేతల వ్యతిరేక ప్రచారం ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి గుక్క తిప్పుకోనివ్వడం లేదు.

ఇక పటాన్‌చెరులో బీసీ, ముదిరాజ్ నినాదంతో పార్టీపై ఒత్తిడి పెంచుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యతిరేక వర్గం. పటాన్‌చెరు టికెట్పై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు రోడ్డెక్కుతున్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క టికెట్ అయినా ఇవ్వాలంటూ స్థానిక నేత నీలం మధుకు మద్దతుగా పఠాన్ చెరులో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మినీ భారత్ను తలపించే పటానుచెరులో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తిరిగి సీటు కేటాయించడంపై బీసీ కులాలతోపాటు రెడ్డి సామాజిక వర్గం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గ నేతలైతే ఏకంగా నీలం మధుకి టికెట్ ఇస్తే కోటి రూపాయిల విరాళం ఇస్తామంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. ఆమె వల్లే అప్పట్లో కేసీఆర్ ఎంపీ అయ్యారన్న రేవంత్ రెడ్డి

జోగిపేటకు చెందిన కొందరు దళిత యువకులు తమకు వచ్చిన దళితబంధు పథకం డబ్బులను నీలం మధుకు విరాళంగా ఇస్తామనడంతో చర్చకు తెరలేపింది. రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల ముదిరాజులు ఉంటే ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఏంటని మధు సామాజికవర్గం నేతలు ప్రశ్నిస్తున్నాడు. బీఆర్ఎస్ సీటు ఇవ్వకపోతే… ఇండిపెండెంట్గా నిలబెదతామంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేపై కేసులు, ఆరోపణలను సొంత పార్టీ నేతలే విస్తృతంగా ప్రచారం చేస్తుండటం బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డికి ఇబ్బందిగా మారుతోంది.

Also Read: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవనున్నాయి- బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఇక మరో నియోజకవర్గం జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావుకు వ్యతిరేకంగా ఇటీవల పార్టీలో చేరిన ఢిల్లీ వసంత్ వర్గం నిరసనలు కొనసాగిస్తోంది. అంతకుముందు పార్టీలో చేరిన నరోత్తం, ఎర్రోళ్ళ శ్రీనివాస్ వంటి నేతలు ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నా.. చెరుకు రైతులతో కలిసి అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు ఢిల్లీ వసంత్. స్థానిక నాయకులతో సమావేశమైన మంత్రి హరీశ్రావు ఎమ్మెల్యే మాణిక్రావును భారీ మెజారిటీతో గెలిపించాలని స్పష్టంగా ఆదేశించినా.. ఢిల్లీ వసంత్ వర్గం పట్టు వీడటం లేదు. మరోవైపు టికెట్ దక్కకపోతే స్వంత్రంగానైనా బరిలోకి దిగాలని అనుచరుల నుంచి వసంత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా మూడోసారి గెలవాలనుకుంటున్న బీఆర్‌ఎస్‌కు.. సీఎం సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడం తలనొప్పిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి బీఆర్‌ఎస్ ఈ అసంతృప్తులకు ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు