గ్రేటర్లో బెటర్‌గా ఉన్న బీఆర్ఎస్‌కు తాజా రాజకీయాలు మింగుడుపడటం లేదు. కాంగ్రెస్‌కు ఒక్క సీటు లేని రాజధాని నగరంలో… గులాబీ ఎమ్మెల్యేల వైఖరి గందరగోళం సృష్టిస్తోంది. ఎవరు ఎప్పుడు కారు దిగేస్తారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉద్యమ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత రెండు రోజుల పరిణామాలు పరిశీలిస్తే… హైదరాబాద్ రాజకీయంలో ఏదో జరుగుతోందనిపిస్తోంది…. అది ఎమ్మెల్యేల పార్టీ మార్పేనా? గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న శాసనసభ్యులు ఎవరు?
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్… బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కరి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు కారు దిగేస్తున్నా… ఇన్నాళ్లు గ్రేటర్లోనే కాస్త బెటర్ అన్న వారు కూడా తాజా రాజకీయాలను చూసి అవాక్కవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల రాజకీయ అడుగులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ సమావేశంతోపాటు, గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి సమావేశానికి సైతం ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఎమ్మెల్యేల షాక్ తప్పదా? అన్న చర్చ జరుగుతోంది.
ఏడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. హైదరాబాద్ సహా నగర శివారులో ఎంఐఎం, బీఆర్ఎస్ పట్టు నిలుపుకోగా, BJP కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది. పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచి మెజారిటీ సాధించిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది.
కాంగ్రెస్‌లో చేరిన తొలి ఎమ్మెల్యే దానం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గ్రేటర్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తొలి ఎమ్మెల్యే. దానం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కూడా కారు దిగి హస్తం జెండా పట్టుకున్నారు. గ్రేటర్‌లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్… గులాబీ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతోంది.
గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం జోరుగా సాగుతున్నా.. గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి సమావేశం గులాబీ పార్టీని అలర్ట్ అయ్యేలా చేసింది. గ్రేటర్ పాలకమండలి సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో భేటీ కావాలని పార్టీ ఆదేశించింది.
సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయాలని మాజీ మంత్రికి పార్టీ పెద్దలు సూచించారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో గ్రేటర్ సమావేశాన్ని నిర్వహించిన తలసానికి ఎమ్మెల్యేల నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి గ్రేటర్ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. అయినా పార్టీ ఎమ్మెల్యేలంతా శనివారం గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి సమావేశానికి హాజరుకావాలని అధినేత కేసీఆర్ ఆదేశించారు.
అయినా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి గ్రేటర్ పాలక మండలి సమావేశానికి హాజరు కాలేదు. ఈ రెండు సమావేశాలకు హాజరుకాని మెజారిటీ ఎమ్మెల్యేల్లో కొందరు నేడో రేపో పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సమావేశానికి నేతృత్వం వహించిన మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసానిపైనా కాంగ్రెస్ ఆకర్ష్ వల విసిరందంటున్నారు. ఈ పరిస్థితుల్లో తలసాని కూడా పార్టీలో కొనసాగుతారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.
కార్పొరేషన్ ఎన్నికల నాటికి..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్లో దెబ్బతిన్న కాంగ్రెస్, కార్పొరేషన్ ఎన్నికల నాటికి పుంజుకోవాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యేల ఆకర్ష్ చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎందరు గులాబీ పార్టీలో కొనసాగుతారన్నది చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల్లోనే ఆరుగురు శాసనసభ్యులు మొదటి విడతలో కారు దిగడం ఖాయమన్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది.
ఈ ప్రచారం ఇలా కొనసాగుతుండగానే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆరుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు ఒకేసారి భేటీకావడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయంగా చర్చకు తావిస్తోంది.
పార్టీ గ్రేటర్ సమావేశానికి రాని ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేదని సమాచారమిచ్చినా.. వారి తీరుపై అధిష్టానం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మొత్తానికి గ్రేటర్లో ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలనే ప్లాన్‌ను వేగంగా అమలు చేస్తోంది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ వలకు ఎంతమంది చిక్కుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్!
Also Read : ఎన్నికల తర్వాత ముఖం చాటేసిన వైసీపీ ఇన్‌ఛార్జులు..