Site icon 10TV Telugu

YS Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర రెడ్డి అనుమానాస్పద మృతి..

Ys Viveka Murder Case

Ys Viveka Murder Case

YS Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివేకానంద రెడ్డి కేసులో గంగాధర్ రెడ్డి కీలక సాక్షిగా ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో గంగాధర్ రెడ్డి మరణం తీవ్ర కలకలంరేపుతోంది. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం (జూన్ 8,2022)రాత్రి కన్నుమూశారు. గంగాధర్ రెడ్డి నిద్రపోయిన సమయంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు.

వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పలు కీలక మలుపులు తిరుగుతు కీలక వ్యక్తులు బయటకు వచ్చిన క్రమంలో గంగాదర్ రెడ్డి మృతి కలకలంరేపుతోంది. సీబీఐ ఇప్పటికే మూడుసార్లు గంగాధర్‌రెడ్డిని ప్రశ్నించింది. ఆయన మృతితో క్లూస్‌ టీమ్‌ కూడా రంగంలోకి దిగింది.. ఆ ఇంటి పరిసరాలను పరిశీలించింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడుగా ఉన్నారు.

గంగాధర్ రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా.. ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో నివసిస్తున్నారు. గంగాధర్ రెడ్డి గతంలో తనకు ప్రాణముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని రెండు మూడు సార్లు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ గతంలో చెప్పారు. కానీ పోలీసులు అతనికి రక్షణ కల్పించలేదు. ఈ క్రమంలో గంగాధర్ రెడ్డి మృతి కలకలం రేపుతోంది.

 

Exit mobile version