AI Revolution : టెక్‌వరల్డ్‌లో ఏఐ విప్లవం.. ఏఐ టెకీలకు భారీ వేతనాలు

AI Revolution : భవిష్యత్‌ అంతా ఏఐదేనని వాదించేవారూ ఇంకొందరున్నారు... ఇన్ని వాదనల మధ్య ఏది నిజం...? కృత్రిమ మేథ లాభనష్టాలేంటి?

AI Taking Over Jobs

AI Revolution : ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌… కృత్రిమ మేథ… 2022లో చాట్‌ జీపీటీ రూపంలో ప్రపంచానికి పరిచయమైన నాటినుంచే ఎన్నో ఆందోళనలు.. మరెన్నో అపోహలను మోసుకొచ్చింది. ఏఐ టెక్నాలజీ విప్లవం తెస్తుందని కొందరు అనుకూల వాదనలు వినిపిస్తుంటే.. ఏఐ వాడకం మనిషి మనుగడకే ప్రమాదమని మరికొందరు వాదిస్తున్నారు…. భవిష్యత్‌ అంతా ఏఐదేనని వాదించేవారూ ఇంకొందరున్నారు… ఇన్ని వాదనల మధ్య ఏది నిజం…? కృత్రిమ మేథ లాభనష్టాలేంటి? రెండేళ్లు కావస్తున్నా ఆధునాతన టెక్నాలజీపై ఇంకా అయోమయమేనా…? టెకీలు ఏమనుకుంటున్నారు…? ఐటీ ఇండస్ట్రీలో స్థిరపడాలని కోరుకునేవారు ఏం చేయాలి?

టెక్‌ ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రస్తుతం చాలామంది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ఆధారపడుతున్నారు. సాంకేతికత, విజ్ఞానం ఆధారిత ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో 92 శాతం మంది కృత్రిమ మేధను వినియోగిస్తున్నారని వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌-2024 అధ్యయనం వెల్లడించింది. మైక్రోసాఫ్ట్, లింక్డ్‌ ఇన్‌ సంయుక్తంగా 31 దేశాలలో 31 వేల మందిపై చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీపై చాలా అపోహలే ఉన్నాయి. ఏఐతో ఉద్యోగాలు పోతాయని, అసలు ఉద్యోగాలే ఉండవని, ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియలోనే ఏఐ జోక్యం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే చాలామంది ఏఐ నిపుణులు ఈ వాదనను కొట్టిపడేస్తున్నారు.

ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే, మంచి ఉద్యోగావకాశాలు, భారీ జీతాలు అందుకోవచ్చని చెప్పేవారు చాలామందే ఉన్నారు. దిగ్గజ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్​సీటీఓ రఫీ తరఫ్​దార్​కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు రఫీ తరఫ్​దార్. ప్రధానంగా ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న యువ ఇంజినీర్లు ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాల్సివుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఏఐ అభివృద్ధి దిశగా జరుగుతున్న ప్రయోగాలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తుంటే, మరోవైపు చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏఐ వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వ్యూల ప్రక్రియలో కృత్రిమ మేధని వాడటం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

వాస్తవానికి ఏఐ టెక్నాలజీతో కొత్త ఉద్యోగాలు పెరిగాయని, భవిష్యత్‌లో ఇంకా పెరుగుతాయనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇంటర్వ్యూల దశలో కృత్రిమ మేధను వాడటం వల్ల సమర్థులను ఎంపిక చేసుకోవడంతోపాటు, దరఖాస్తుల వడపోత ప్రక్రియ వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పుడు సరైన అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని, అదే కృత్రిమ మేధ వల్ల దరఖాస్తుల స్క్రీనింగ్‌ వేగంగా జరిగి దరఖాస్తుదారులు చాలా తొందరగా ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ఏఐ అనుకూల వాదులు మాత్రం ఇదో టెక్నాలజీ విప్లవంగా చెబుతున్నారు. అనవసర అపోహలు మానుకుని ఏఐని సమర్థంగా వాడుకుంటే మంచి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పేవారు మరికొందరు ఉన్నారు. సినీ, టీవీ పరిశ్రమల్లో ముందు ఏఐ వాడకంపై చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉండేవని… క్రమంగా ఆ పరిశ్రమ ఏఐ వాడుకుని అద్భుతాలు సృష్టిస్తోందని నెట్‌ఫ్లిక్స్‌ సహ సీఈవో టెడ్‌ సరోండోస్‌ చెబుతున్నారు. సృజనాత్మక రంగంలో కృత్రిమ మేధతో వచ్చే ప్రమాదమేమీ లేదని, అదేసమయంలో రచయితలు, సంపాదకులు, దర్శకులు ఏఐను వాడుకుని ప్రతిభావంతమైన ఫలితాలు సాధించవచ్చని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఏఐపై ఉన్న అపోహలు క్రమంగా తొలుగుతుండటం.. భవిష్యత్‌పై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

Read Also : Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లివే.. ధర, వ్యాలిడిటీ వివరాలివే!

ట్రెండింగ్ వార్తలు