చల్లటి వార్త : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి

  • Publish Date - May 12, 2020 / 04:58 AM IST

భానుడి భగభగల నుంచి ప్రజలకు మరొకొన్ని రోజుల్లోనే ఉపశమనం కలగనుంది. నిర్దారిత సమయంకంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశాన్ని పలకరించనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఈ నెల 16వ తేదీనే చేరుకోనున్నాయి. మే 20న రుతుపవనాలు అండమాన్‌ను తాకవచ్చని భారత వాతావరణశాఖ ముందుగా అంచనా వేసింది. 

కానీ నాలుగురోజుల ముందుగానే అండమాన్‌కు చేరుకోనున్నట్టు అధికారులు వివరించారు. మరోవైపు తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడువరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న సమద్రతీర ప్రాంతాల్లో మధ్యస్త ట్రోపోస్పియర్‌ స్థాయిల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 

దీని ప్రభావం వల్ల ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న అండమాన్‌సముద్ర ప్రాంతాల్లో 2020, మే 13వ తేదీ బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో 72 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఇది మరింత బలపడే అవకాశమున్నది. తెలంగాణలో మరో 48 గంటలవరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ట్రెండింగ్ వార్తలు