అనూజ్ తపన్ చనిపోలేదు, చంపేశారు.. ముంబై పోలీసులపై ఆరోపణలు

అనుజ్‌ను 6-7 రోజుల క్రితం సంగ్రూర్ నుంచి ముంబై పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులే అతడిని చంపేసి ఉంటారు. మాకు న్యాయం జరగాలి.

Salman Khan residence attack case: బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల కేసులో నిందితుడు అనూజ్ తపన్ అనుమానాస్పద మృతిపై అతడి కుటుంబ సభ్యులు స్పందించారు. అనూజ్ ప్రాణాలు తీసుకోలేదని, పోలీసులే హత్య చేశారని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనూజ్ తపన్ అనుమానాస్పద మృతిపై మహారాష్ట్ర సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.

అనూజ్ తపన్ అనుమానాస్పద మృతిపై పంజాబ్‌లోని అబోహర్‌ నగర సమీపంలోని సుఖ్‌చైన్ గ్రామానికి చెందిన నిందితుడి సోదరుడు అభిషేక్ తపన్ బుధవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. “అనుజ్‌ను 6-7 రోజుల క్రితం సంగ్రూర్ నుంచి ముంబై పోలీసులు తీసుకెళ్లారు. అనూజ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఈరోజు మాకు ఫోన్ చేశారు. అతడు ఆత్మహత్య చేసుకుని ఉండడు. పోలీసులే అతడిని చంపేసి ఉంటారు. మాకు న్యాయం జరగాలి. అతను ట్రక్ హెల్పర్‌గా పనిచేశాడ”ని అభిషేక్ తపన్ తెలిపారు.

Also Read: విజయవాడలో విషాద ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

కాగా, అనూజ్ తపన్ బుధవారం హెడ్‌క్వార్టర్స్‌లోని లాకప్ గదిలోని వాష్‌రూంలో దుప్పటితో ఉరేసుకున్నట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్ప పొందుతూ చనిపోయాడని తెలిపారు. ఏప్రిల్ 26న అనూజ్ తపన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై ఏప్రిల్ 14న జరిగిన కాల్పుల ఘటనలో అరెస్టైన ఇద్దరు నిందితులు సాగర్ పాల్, విక్కీ గుప్తాకు అనూజ్ ఆయుధాలు సరఫరా చేశాడని పోలీసులు అనుమానించారు.

 

ట్రెండింగ్ వార్తలు