Bengaluru Techie Suicide: వంట విషయంలో అత్తతో గొడవ.. ఆత్మహత్య చేసుకున్న టెకీ
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. వంట విషయంలో మొదలైన వివాదం కాస్త మాజీ టెకీ ప్రాణం తీసింది. అత్తగారు తనను వంట చేయవద్దని చెప్పడం.. అప్పటికే అనేక సార్లు వేధించడంతో విరక్తి చెందిన టెకీ దారుణ నిర్ణయం తీసుకుంది.
dispute with mother in law over cooking Bengaluru techie dies by suicide
Bengaluru Techie Suicide: చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా అత్తింటి వేధింపులు భరించలేక దారుణ నిర్ణయాలు తీసుకుంటున్న వివాహిత మహిళల సంఖ్య అధికంగా ఉంటోంది. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అత్తింటి వారి వేధింపులతో విసిగిపోయిన ఒక మహిళా టెకీ ఆత్మహత్య చేసుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు వివాహితలు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సుష్మ (35) అనే టెకీ తన అత్తగారైన కల్పన వేధింపులు తాళలేక ఈ దారుణానికి పాల్పడింది. వంట చేసే విషయంలో అత్తాకోడళ్ల మధ్య రాజుకున్న వివాదం సుష్మ ప్రాణాలు తీసుకోవడానికి కారణమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన సుష్మ గతంలో అమెరికాకు చెందిన ఒక ప్రముఖ టెక్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఐదు సంవత్సరాల క్రితం ఆమెకు పునీత్ కుమార్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
వివాహమైన నాటి నుంచే సుష్మను అత్తింటి వారు వేధించేవారని, అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేసేవారని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. నిత్యం గొడవపడుతుండేవారని.. ఈ క్రమంలోనే మంగళవారం నాడు సుష్మకు, ఆమె అత్తగారికి వంట చేసే విషయంలో గొడవ జరిగిందని, అత్తగారు ఆమెను వంట చేయనివ్వలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అత్తగారి ప్రవర్తనతో విసిగిపోయిన సుష్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త పునీత్ కుమార్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సుష్మ అత్తగారు కల్పన కోసం గాలిస్తున్నారు.
వారం రోజుల క్రితమే బెంగళూరులో ఇదే తరహా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 28న విద్యాజ్యోతి అనే 27 ఏళ్ల మహిళా టెకీ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. వేరే కులం వ్యక్తిని ప్రేమించిన జ్యోతి వివాహానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే, జాతకాలు చూసిన ఒక పండితుడు.. పెళ్లి తర్వాత వారి మధ్య గొడవలు జరిగి విడిపోతారని చెప్పాడు. అలా జరగకుండా ఉండాలంటే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని సూచించాడు. జ్యోతిష్యుడు చెప్పినట్లే విద్యాజ్యోతి తల్లిదండ్రులు పూజలు నిర్వహించారు. అయితే పూజ చివరి రోజైన 9వ నాడు విద్యాజ్యోతి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళా టెకీలు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
