Siya Goyal Snapchat : పుణె కేతన్ హత్యకేసులో కొత్త ట్విస్ట్.. స్నాప్‌చాట్ మెసేజ్!.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి..
Siya Goyal - Ketan Agarwal Case : పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Pune Ketan Agarwal Murder Case Siya Goyal Snapchat Messages
Siya Goyal – Ketan Agarwal Case : పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు సియా గోయల్ తన మొబైల్ ఫోన్ నుంచి స్నేహితురాలికి పంపిన ఓ స్నాప్‌చాట్ సందేశం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.
దర్యాప్తు అధికారుల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న చాట్లలో ఒకదానిలో పెళ్లికి టికెట్లు బుక్ చేసుకోవడం కోసం తన ఆధార్ కార్డు రెండు వైపులా పంపమని సియా తన స్నేహితురాలిని అడుగుతున్నట్లు గుర్తించారు. అందులో ‘ఆధార్ కార్డు ముందు వెనుక ఫొటోలు పంపండి. జరగని పెళ్లికి టికెట్లు బుక్ చేయడం కోసం, అయినా సరే పంపండి’’ అని రాసి ఉన్నట్లు సమాచారం. . ఈ మెస్సేజ్ ఇప్పుడు కేసులో కొత్త అనుమానాలకు తెరతీసింది.
దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సియా గోయల్ మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన చాట్లను రికవరీ చేయగా ఈ సందేశం బయటపడింది. దీనికి స్నేహితురాలు ఇప్పటికే ఆధార్ కార్డు వాట్సాప్‌లో పంపించినట్లు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణ హత్యకు ముందు లేదా తర్వాత జరిగిన పరిణామాలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో డిలీట్ చేసిన డేటాను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, సియా గోయల్, సహ నిందితుడు చేతన్ చౌదరి కోడ్ పదాలు, ఎమోజీలు, మారుపేర్లతో రహస్యంగా మాట్లాడుకున్నట్లు గుర్తించారు. ఈ కోడ్ సంభాషణల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? హత్య కుట్రతో సంబంధం ఉందా? అనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు మరో కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. ఈ డిజిటల్ ఆధారాలు హత్య కుట్రలో మరెవరైనా పాల్గొన్నారా అనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ 14 రోజుల న్యాయపరమైన కస్టడీలో ఉన్నారు. విచారణలో భాగంగా ఇద్దరూ పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షకు అంగీకరించలేదని సమాచారం. దీంతో కోర్టుసైతం పాలీగ్రాఫ్ టెస్టుకోసం పోలీసులకు అనుమతి ఇవ్వలేదు.
కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తుండటంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ ఆధారాలు, డిలీట్ చేసిన చాట్లు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు.
