AP Covid Cases : ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఆ జిల్లాలో ఇద్దరు మృతి, నలుగురికి పాజిటివ్.. కీలక సూచనలు
AP Covid Cases : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్ బారినపడి మృతి చెందారు. మరో నలుగురికి కోవిడ్ వైరస్ సోకినట్లు గుర్తించారు.
AP Covid Cases
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం
- ఇద్దరు మృతి.. నలుగురికి పాజిటివ్
- కరోనా కేసులపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఫ్యాక్ట్‌చెక్ టీమ్
AP Covid Cases : యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఏపీలో మళ్లీ విజృంభిస్తోందా ఆనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏపీలో నాలుగేళ్ల తరువాత కరోనా వైరస్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. మరో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది.
Also Read : AP Rain Alert : ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ.. రైతులకు కీలక సూచనలు
అధికారుల సమాచారం ప్రకారం.. కరోనా సోకిన నలుగురిలో ముగ్గురు స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరో వ్యక్తిని కడపలోని ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ నలుగురికి కడపలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా నిర్దారణ అయింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన నలుగురూ గతంలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా.. వారిలో ఒకరు బూస్టర్ డోసు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.
ఏపీలో కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో పలు విధాలుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ స్పందించింది. ఈ మేరకు కోవిడ్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడింది. ఎన్. సుబ్బరాయుడు (52) మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతూ జూన్ 28న చికిత్స పొందుతూ మృతి చెందారు. సయ్యద్ మబాషా (43) దీర్ఘకాలంగా మద్యం సేవించే అలవాటు ఉండగా, తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతూ జూలై 7న కన్నుమూశారు.
మరోవైపు వీరారెడ్డి (66) మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతూ చికిత్స అనంతరం కోలుకుని జూలై 4న తిరుపతికి డిశ్చార్జ్ అయ్యారు. జి. కొండయ్య (67) మధుమేహం, క్షయవ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం కడప ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్షత్ (25)కు కరోనా సోకినా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో హోమ్ ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే, కరోనా బారినపడిన వారిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టగా.. వారిలో ఎవరికీ ఇటీవల ప్రయాణ చరిత్ర లేదని తేలింది. దీంతో జిల్లాలో స్థానికంగానే వైరస్ వ్యాప్తి జరిగి ఉండొచ్చునని ఆరోగ్యశాఖ అనుమానిస్తోంది. నమోదైన కేసుల్లో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో పల్మనాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ అండర్గ్రాడ్యుయేట్ ఇంటర్న్ వైద్య విద్యార్థి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉండి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
కడప ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. హైప్లో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలను అందుబాటులో ఉంచడంతోపాటు 24 గంటల పాటు అత్యవసర వైద్యసేవలు అందేలా ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వేలు నిర్వహిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారిని గుర్తించి వెంటనే కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ, ప్రాంగణాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
అయితే, కరోనా పరిస్థితిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, ప్రజల్లో భయాందోళనలు కలిగించే అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించవద్దని సూచించింది.
