AP Rain Alert : ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ.. రైతులకు కీలక సూచనలు
AP Rain Alert : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గురువారం మేఘావృతమైన వాతావరణంతోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Andhra pradesh weather update
- ఏపీకి రెయిన్ అలర్ట్..
- పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- ఎల్నినో ముప్పు.. రైతులకు కీలక సూచనలు
AP Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.
రాష్ట్రంలో వర్షాలకుతోడు పలు ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మరోవైపు.. ఎల్నినో ముప్పు నేపథ్యంలో రైతులు పంటల సాగు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతానికి ఏపీలో మోస్తరు మినహా పెద్దగా వర్షాలు పడలేదు. దీంతో ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. రాబోయేరోజుల్లో దీని ప్రభావం తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎల్నినో ముప్పు నేపథ్యంలో తక్కువ నీటి వినియోగంతో పండించే పంటల సాగును చేపట్టాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది.
