AP Rains
AP Rains: కొద్దిరోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వచ్చే ఐదు రోజులు వానలు దంచికొడతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది వాయుగుండంగా బలపడి శనివారం నాటికి తీరందాటొచ్చని అంచనా. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు.. బంగాళాఖాతంలో ఈనెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే ఈనెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో జోరుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన పంటలు నీటమునిగి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 2,23,802 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,73,651 క్యూసెక్కులుగా ఉంది. ఇక, శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటినిల్వ 204.7889 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.