Nagari Constituency: నగరిలో ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారో!?

నగరిలో టీడీపీ, జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన టీడీపీ, జనసేన ఈ సారి కలిసి పోటీ చేస్తే ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉందంటున్నారు.

Nagari Assembly Constituency Ground Report

Nagari Assembly Constituency: వైసీపీలో ఫైర్‌బ్రాండ్ నేత మంత్రి ఆర్‌కే రోజా (RK Roja) తన వాక్ చాతుర్యంతో ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో దాడి చేసే మంత్రి రోజాకు స్వపక్షం నుంచి ఎన్నో సవాళ్లు.. రాజకీయాల్లో ఐరెన్ లెగ్ అన్న విమర్శలను తిప్పికొట్టి అధికార వైసీపీలో గోల్డెన్ లెగ్‌గా ప్రశంసలు అందుకుంటున్న మంత్రి రోజా (Minister Roja) వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గాలి ముద్దుకృష్ణుమనాయుడు (Gali Muddu Krishnama Naidu) వంటి ఉద్దండ నేతను ఓడించడమే కాకుండా వరుసగా రెండుసార్లు గెలిచిన రోజాకు ఈ సారి టిక్కెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు జిల్లాలో ఇద్దరు మంత్రులు కూడా రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారని చెబుతున్నారు. ఇన్ని సవాళ్లను మంత్రి రోజా ఎలా అధిగమిస్తారు.. మరికొద్ది రోజుల్లో జిల్లాలో పర్యటించనున్న జగన్.. రోజా పోటీపై గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? నగరిలో ఈ సారి కనిపించబోయే సీనేంటి?

AP Minister RK Roja

చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే నగరి నియోజకవర్గం నుంచి ఎందరో ఉద్దండ నేతలు ప్రాతినిధ్యం వహించారు. రెడ్డివారి చెంగారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి సీనియర్ నేతలు నగరి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్‌కే రోజా రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా… సీనియర్ నేత ముద్దుకృష్ణుమనాయుడిని ఓడించి సంచలనం సృష్టించారు. ఇక గత ఎన్నికల్లో ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాశ్‌పై (Bhanu Prakash Gali) పోటీ చేసి విజయం సాధించారు. అధికార వైసీపీలో సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో రోజా ఒకరు. వైసీపీ మహిళా నేతల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. సీఎం జగన్‌పై ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టే రోజా.. రాష్ట్రస్థాయిలో రాజకీయంగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ నేపథ్యం కన్నా మంత్రిగా ఆమెకు రెట్టింపు గుర్తింపు రావటానికి కారణం.. ప్రత్యర్థులపై విమర్శలదాడిలో ముందుండే నేపథ్యమే.. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్, జనసేనాని పవన్‌పై విమర్శల్లో ముందుండే రోజాకు సొంత పార్టీలో మాత్రం సెగ గట్టిగానే తగులుతుందని చెబుతున్నారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజన నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాల పేట మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. బీసీలతోపాటు తమిళ మొదలియార్ ఓట్లర్లు ఎక్కువగా ఉన్న నగరిలో తమిళ పార్టీలు అన్నా డీఎంకే, డీఎంకే కూడా పోటీ చేస్తుంటాయి. 1972లో డీఎంకే అభ్యర్థి జ్ఞాన ప్రకాశం రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక నియోజకవర్గంలో ఎక్కువ మంది పవర్ లూమ్స్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. వస్త్రాలకు రంగులు అద్దడం ఇక్కడి వారి ప్రధాన వృత్తి. ఐతే రంగులు అద్దడం వల్ల కలుషితమయ్యే జలాలు భూగర్భంలో ఇంకుతుండటంతో తాగునీరు విషతుల్యంగా మారింది. కలుషిత జలాలు తాగడం వల్ల స్థానికుల్లో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. తమిళనాడులో డైయింగ్ యూనిట్లను మూసేయడంతో అక్కడి వ్యాపారులు నగరికి వచ్చి దారాలకు డైయింగ్ వేయిస్తుండటంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. నగరిలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే ఈ సమస్యను అధిగమించొచ్చనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. గాలేరు – నగరి ప్రాజెక్ట్ ద్వారా మంచినీటి సమస్య తీరుతుందని ఆశించినా.. ఆ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి రోజాకు ఈ సమస్యలు కూడా సవాల్‌గా మారుతున్నాయి.

RK Roja

ఇక నగరి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో భూ దందాలు, అవీనితికి అడ్డూ అదుపు లేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి రోజా ఇద్దరు సోదరులపై అనేక భూ దందా ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందా, బియ్యం అక్రమ రవాణాలోనూ మంత్రి సోదరులపై ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. ఐతే మంత్రి విపక్షాలను ఆరోపణలను ఏ మాత్రం లెక్కచేయకుండా తన పని చేసుకుపోతున్నారు. ఇదేసమయంలో మంత్రి సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత పెరిగిపోవడం మైనస్‌గా మారుతోంది. నగరి వైసీపీలో మూడు నాలుగు వర్గాలు తలనొప్పిగా మారుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో మంత్రి రోజాను గెలిపించిన వారే ఇప్పుడు తిరుగుబాటు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మంత్రికి వ్యతిరేకంగా మండలానికి ఓ నేత తయారు కావడం క్యాడర్‌ను గందరగోళానికి గురిచేస్తోంది.

Also Read: లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసేదెవరు.. ఆర్కేను బాపట్లకు మారుస్తారా?

వడమాల పేట జడ్పీటీసీ సభ్యుడు సురేశ్ రెడ్డి, శ్రీశైలం ఆలయ పాలకమండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి రాజు, పుత్తూరు అమ్ములు, ఈడిగ కార్పొరేషన్ అధ్యక్షులు శాంతి మంత్రికి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి, మరో మంత్రి నారాయణస్వామితో కూడా రోజాకు పొసగడం లేదు. తన వ్యతిరేకులను మంత్రులిద్దరూ ప్రోత్సహిస్తున్నారని రోజా కూడా ఆ ఇద్దరిపై గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజాకి టికెట్ రాకుండా చేస్తామని ఆమె ప్రత్యర్ధి వర్గం సవాల్ చేస్తోంది. ఐతే సీఎం అండదండలు ఉండటంతో రోజాకు ఎట్టిపరిస్థితుల్లోనూ టిక్కెట్ దక్కే అవకాశం ఉందని వైసీపీ వర్గాల సమాచారం. ఈ నెలాఖరున సీఎం జగన్ పర్యటనలో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి రోజా కూడా సీఎం ఆశీస్సులతో మళ్లీ పోటీ చేసి గెలుస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Bhanu Prakash Gali

వైసీపీలో గ్రూప్‌వారే విపక్ష పాత్ర పోషిస్తుండటంతో.. టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాశ్ పని తేలికవుతోందని అంటున్నారు. స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడైన భానుప్రకాశ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతితోపాటు.. తన తండ్రి అనుచర వర్గం ఆశీస్సులు, టీడీపీ ఓటు బ్యాంక్‌తో ఈ సారి నగరిలో టీడీపీ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు భానుప్రకాశ్. ప్రస్తుతం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో బిజీగా ఉన్నారు భానుప్రకాశ్. మంత్రి రోజాపై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందంటున్నారు భానుప్రకాశ్. గత ఎన్నికల్లో కేవలం రెండు వేల ఐదు వందల ఓట్ల తేడాతోనే ఓడిపోయామని.. ఈ సారి గెలుపు పక్కా అన్నధీమాతో ఉన్నారు భానుప్రకాశ్.

Also Read: పాయకరావుపేటలో అంతకుముందు అనితకు ఎదురైన పరిస్థితే.. ఇప్పుడు బాబురావుకు..

నగరి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీలకు పెద్దగా క్యాడర్ లేదు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ జరిగే అవకాశం ఉంది. ఇక టీడీపీ, జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి రోజా అవకాశం చిక్కినప్పుడల్లా.. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలపై వాగ్బాణాలు సంధిస్తుండటం.. ఆయా పార్టీలకు టార్గెట్‌గా మారిపోయారు. గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన టీడీపీ, జనసేన ఈ సారి కలిసి పోటీ చేస్తే ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇటు స్వపక్షం.. అటు విపక్షంతో పోరాడాల్సిన పరిస్థితిలో రోజా అనుసరించే రాజకీయం వ్యూహాంపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు