ఒక్క ఓటమితో అంతా తారుమారు.. రోజా పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనా? ఎందుకీ దుస్థితి?

రాజకీయంగా సైలెంట్‌గా ఉంటున్నప్పటికీ వివాదాలు రోజాను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయ భవిష్యత్‌పై రకరకాల చర్చ జరుగుతోంది.

Gossip Garage : ఐరెన్‌ లెగ్‌ అంటూ అవమానాలు ఎదుర్కొన్న ఆ మహిళా నేత… రాష్ట్ర రాజకీయాల్లో ఐరెన్‌ లేడీగా ఎదిగారు. గత ఐదేళ్లు రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పారు. గులాబీలా అందరినీ ఆకర్షించిన నేత.. తన మాటలు, చేష్టలతో ముల్లులా మారిపోయారు. ఒకవైపు అభిమానులు.. అంతకు మించిన సంఖ్యలో శత్రువులను పెంచుకున్నారు. అమాత్య పదవితో పెరిగిన గౌరవం… ఒక్క ఓటమితో కనుమరుగైంది.

సొంత నియోజకవర్గంలో తిరగలేని దుస్థితికి దిగజార్చింది. వెండితెర నుంచి పొలిటికల్‌ స్ర్కీన్‌ వరకు అత్యంత ఆకర్షణీయంగా సాగిన ఆమె జర్నీ… ఇక కొనసాగే పరిస్థితి ఉందా? అద్భుతమైన పొలిటికల్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. ఏపీలో అత్యంత వివాదాస్పదంగా మారిన నేత ఎవరు?

సస్పెన్స్ గా మారిన రోజా పొలిటికల్‌ జర్నీ..
వైసీపీ మహిళా నేత, రాష్ట్ర మాజీ మంత్రి ఆర్‌కే రోజా పొలిటికల్‌ జర్నీ సస్పెన్స్‌గా మారింది. తూటాల్లాంటి మాటలతో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన రోజా… అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సొంత నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారు. ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే బయటికి వచ్చిన రోజా…. పూర్తిగా ఇంటికే పరిమితమవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీబిజీగా గడిపిన రోజా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు, ఆలయాల్లో పూజలకు మాత్రమే పరిమితమయ్యారు. మీడియాకు ముఖం చాటేస్తున్నా… పైగా కొత్త వివాదాలకు కేంద్రమవుతున్నారు.

సొంత పార్టీలోనే శత్రువులను పెంచుకున్న వైనం..
రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి మాజీ మంత్రి రోజా విషయంలో అతికినట్లు సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి, రాజకీయాల్లోకి వచ్చిన రోజా… ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక స్థాయికి చేరుకున్నారు. రాజకీయంగా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు పేర్చుకుని… ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం…. ఓటమి తర్వాత ఒక్కపెట్టున కూలిపోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిపదవి చేపట్టిన తర్వాత సొంత పార్టీలోనే శత్రువులను పెంచుకున్న రోజా…. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కనీసం పలకరించే వారు లేక… రాజకీయ కార్యక్రమాలకు దూరమవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. తన విజయం కోసం కష్టపడి చేసిన కార్యకర్తలు, నాయకులను విస్మరించడం… సోదరులు, భర్త జోక్యం వల్ల రోజా రాజకీయ భవిష్యత్‌ గందరగోళంగా మారిందంటున్నారు.

అదుపులేని మాటల వల్ల రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి..
రాజకీయంగా అవకాశాలను అందిపుచ్చుకున్న రోజా… వైసీపీ ప్రభుత్వంలో బలమైన రాజకీయ శక్తిగా మారారు. ఐతే రాజకీయంగా ఆమె చేసిన తప్పులు ఇప్పుడు శాపంగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాక్చాతుర్యమే తన బలమని ఇంతకాలం నమ్ముతూ వచ్చిన రోజా… చివరకు తన మాటలతో అందరినీ దూరం చేసుకున్నారంటున్నారు. గత ఐదేళ్లలో అదుపు లేని మాటల వల్ల రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితిని తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు రోజా స్థాయిని దిగజార్చడం, ఆమె పేరు ఎత్తితే ప్రజలు యావగించుకునే స్థితి ఎదురవడం వ్యక్తిగతంగా రోజాకు… ఆమె పార్టీ వైసీపీకి తీవ్ర నష్టం చేసిందంటున్నారు.

అందరి దృష్టిలో పొలిటికల్‌ విలన్‌..
పరుష వ్యాఖ్యలతో ప్రత్యర్థులతో శత్రుత్వం పెంచుకున్న రోజా… సొంత పార్టీలోనూ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు గిట్టని వారిగా మారిపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడైనా నెగ్గాల్సిందే తప్ప, తగ్గేదేలే అన్నట్లుగా రోజా నెరిపిన రాజకీయం బెడిసి కొట్టడమే ప్రస్తుత ఆమె దుస్థితికి నిదర్శనమంటున్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా కార్యకర్తలకు దూరమైన రోజాను అంతా పొలిటికల్‌ విలన్‌గా చూస్తుండటమే చర్చనీయాంశమవుతోంది. పార్టీ అధినేత చెప్పినా, రోజాతో చేతులు కలపడానికి పార్టీ నేతలు ఇష్టపడకపోవడంతో నగరిలో రోజా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు.

మంత్రి పదవి, మాజీ సీఎం జగన్‌ వద్ద పలుకుబడితో నగరిలో తనకు తిరిగే లేదన్నట్లు చక్రం తిప్పిన రోజా… ఇప్పుడు పార్టీలో గ్రూపులను తట్టుకోలేకపోతున్నారంటున్నారు. మంత్రిగా ఉండగానే ఆమెను వ్యతిరేకించిన నేతలు.. ఇప్పుడు మాజీ అవ్వడంతో ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఓడిన తర్వాత కనీస పరామర్శకు కూడా కార్యకర్తలు ఇష్టపడకపోవడం… నియోజకవర్గంలో ఆమె దుస్థితిని తెలియజేస్తోందంటున్నారు.

విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో బయటకు రాలేని పరిస్థితి..
ఎన్నికల్లో ఓటమి తర్వాత నెలన్నర రోజులు నగరిలోని ఇంటికి ఎక్కువ కాలం పరిమితమయ్యారు రోజా. వీకెండ్స్‌లో చెన్నై వెళుతున్నారు. వీలున్నప్పుడల్లా ఆలయాలు సందర్శిస్తున్నారు. ఒకటి రెండు మార్లు మాత్రమే నగరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారు రోజా. ముఖ్యంగా మీడియాతో మాట్లాడటానికి ఆమె ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో రోజా బయటకు రాలేకపోతున్నారంటున్నారు.

తమిళనాడు ఆలయంలో వివాదాస్పద తీరు..
ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరు కూడా వివాదాస్పదమైంది. తమిళ మీడియా సైతం రోజా చర్యను ఎండగట్టింది. రాజకీయంగా సైలెంట్‌గా ఉంటున్నప్పటికీ వివాదాలు రోజాను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయ భవిష్యత్‌పై రకరకాల చర్చ జరుగుతోంది. రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్న రోజా… ఎలా ముందుకు వెళతారనేదే ఆసక్తికరంగా మారింది.

Also Read : ఇది ప్రమాదంగా అనిపించడం లేదు, అక్కడ కొత్త అగ్గిపెట్టె గుర్తించాం- మదనపల్లె ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు