ఇది ప్రమాదంగా అనిపించడం లేదు, అక్కడ కొత్త అగ్గిపెట్టె గుర్తించాం- మదనపల్లె ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

సాక్ష్యాలు మాయం చేయడానికి ఇలా చేసే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై ఇక కఠిన చర్యలు ఉంటాయి.

ఇది ప్రమాదంగా అనిపించడం లేదు, అక్కడ కొత్త అగ్గిపెట్టె గుర్తించాం- మదనపల్లె ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

Madanapalle Sub Collectors Office Fire Incident : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై డీజీపీ ద్వారక తిరుమల రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదని భావిస్తున్నామన్న ఆయన.. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి 50 అడుగుల దూరంలోనూ కాలుతున్న ఫైల్స్ కనిపించాయన్నారు. ఇది ఎవరో చేసినట్లు తెలుస్తోందన్నారు.

” రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. 3 గంటలు విచారణ జరిపాము. ఇది ప్రమాదంగా మాకు అనిపించడం లేదు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆర్డీవో ప్రసాద్ కలెక్టర్ కు సమాచారం ఇవ్వలేదు. అత్యంత కీలకమైన 22ఏ సెక్షన్ లో ఇది జరిగింది. షార్ట్ సర్క్యూట్ కు అవకాశం లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. పక్కనే సబ్ స్టేషన్ కూడా ఉంది. ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. సమాచారం తెలిసి సిఐ కూడా కనీసం డీఎస్పీకి చెప్పలేదు. రాత్రి 10.30 వరకు కూడా ఇక్కడ విధులు నిర్వర్తించారు. ఎందుకు వచ్చారో తెలియడం లేదు.

ఘటనకు సమీపంలోనే కొత్త అగ్గిపెట్టె గుర్తించాం. ఫోరెన్సిక్ నిపుణులు విచారణ జరుపుతున్నారు. సాక్ష్యాలు మాయం చేయడానికి ఇలా చేసే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై ఇక కఠిన చర్యలు ఉంటాయి. ఈ ఘటనపై విచారణకు 10 బృందాలు నియమించాము. అవసరమైతే ఈ కేసును సిఐడికి బదలాయిస్తాము. ఇది యాక్సిడెంట్ కాదని భావిస్తున్నాము. విచారణలో అన్నీ బయటకు వస్తాయి” అని డీజీపీ ద్వారక తిరుమల రావు అన్నారు.

” ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. అగ్నిప్రమాద ఘటనపై అనేక అనుమానాలున్నాయి. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదు. ప్రమాదంపై ఎస్పీ, డీఎస్పీలకు సీఐ చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆర్డీవో కూడా కలెక్టర్ కు సమాచారం ఇవ్వలేదు. కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కీలక రికార్డులు ఉన్న విభాగంలోనే ప్రమాదం జరిగింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నాం” అని డీజీపీ తెలిపారు.

మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాద ఘటన సంచలనంగా మారింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భూముల రికార్డులు దగ్ధం అవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణకు ఆదేశించారు. హెలికాప్టర్ లో మదనపల్లెకు వెళ్లాలని డీజీపీ, సీఐడీ చీఫ్ లను ఆదేశించారు సీఎం చంద్రబాబు.

Also Read : ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం