Gujarat Polls: బీజేపీ ప్రచారంలో విదేశీయులు.. ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది విదేశీయులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారంలో కనిపించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడారు. ఈ వీడియోను గుజరాత్ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నియామళిని ఉల్లంఘించి విదేశీయులతో ప్రచారం చేస్తున్నారని, బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసిన విదేశీయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే లేఖ రాశారు.

“భారతీయ ఎన్నికలలో ఇది తీవ్రమైన విదేశీ జోక్యం. ప్రజల ప్రాతినిధ్య చట్టం, 1951 అలాగే భారతదేశ వీసా చట్టాలను పూర్తిగా ఉల్లంఘించడమే” అని ఈసీకి రాసిన లేఖలో గోఖలే పేర్కొన్నారు. గుజరాత్ బీజేపీ షేర్ చేసిన వీడియోలో బీజేపీకి ప్రచారం చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని పొగడటం చూడొచ్చు. “తమ నాయకుడిని చూడడానికి, ఆయన చెప్పేది వినడానికి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు” అని ఒక విదేశీ వ్యక్తి చెప్పడం వినవచ్చు.

ఎన్నికల చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి విదేశీయులను బీజేపీ వాడుకుంటోందని గోఖలే ఆరోపించారు. “విదేశీయులైన రష్యన్లు ఎన్నికలలో జోక్యం చేసుకుని తీవ్రమైన పరిస్థితులను రెచ్చగొట్టారు” అని గోఖలే అన్నారు. “ఈ విషయమై తక్షణమే చర్య తీసుకోవాలని భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాను. అలాగే విషయ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, విదేశీ పౌరులపై ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తక్షణ చర్య తీసుకోవాలని గుజరాత్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‭కి తెలియజేయాలని కోరుతున్నాను’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.

Gujarat: లవ్ జిహాదీ ఆరోపణలతో ముస్లిం విద్యార్థులపై అమానవీయ దాడి

ట్రెండింగ్ వార్తలు