Banana Cultivation : వేసవి అరటి తోటల్లో మేలైన యాజమాన్యం

అసలే సున్నితమైన అరటికి ఈవేసవి గడ్డుకాలమనే చెప్పాలి. మరి, ఇలాంటి సమయంలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Summer Management in Banana

Banana Cultivation : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మానవాళికీ, పశుపక్షాదులకే కాదు పచ్చని మొక్కలకు సైతం ఈ వేడిగాలుల తీవ్రత తప్పటం లేదు. అరటినే తీసుకుంటే.. నాటిన సమయాన్ని బట్టి 3, 4 నెలల వయస్సు నుంచి గెలలు కోసే దశ వరకు వివిధ దశల్లో వుంది. అసలే సున్నితమైన అరటికి ఈవేసవి గడ్డుకాలమనే చెప్పాలి. మరి, ఇలాంటి సమయంలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Vegetables Farming : అంతర పంటలతో అదనపు ఆదాయం.. కూరగాయల సాగుతో.. అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

అరటి.. అన్ని వయస్సుల వారు తినదగ్గ మంచి పోషకఫలం. అందుకే దీనిసాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా టిష్యూకల్చర్ రకాల రాకతో ఎకరానికి 35 నుంచి 40టన్నుల అత్యధిక దిగుబడిని మన రైతులు సాధిస్తున్నారు. ప్రస్థుతం అరటి సాగు వివిధ దశల్లో వుండగా కొంతమంది కొత్తగా నాటేందుకు సిద్ధమవుతున్నారు. అరటి చాలా సున్నితమైన మొక్క. వేసవి గాలులకు అస్సలు తట్టుకోలేదు. ఇప్పటికే 45డిగ్రీల ఎండతీవ్రత దాటిన ఈసమయంలో పెరుగుదల తగ్గటమే కాదు అనేక రకాల చీడపీడలూ ఆశించి నష్టపరుస్తూ వుంటాయి. అందుకే ఈవేసవి 3నెలల్లో అరటి తోటల సంరక్షణకు  రైతులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

మనప్రాంతంలో ఎక్కువగా సాగులో వున్న అరటి రకం- గ్రాండ్  నైన్. ఈరకం ఎండతీవ్రతను తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో పొట్టి పచ్చ అరటి, కర్పూర చక్కెర కేళి వంటి రకాలను సాగుకు ఎంచుకుంటే ఎండతీవ్రతను కొంత వరకు తట్టుకుని, పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. ముఖ్యంగా, అరటి వయస్సును బట్టి ఈ మెలకువలు పాటించాలి. మొదటి నాలుగు మాసాలలోపు వున్న అరటి తోటల్లో ఆకులు ఎండిపోయి, మొక్కలు చనిపోవటానికి ఎక్కువ అవకాశం వుంది. కనుక ప్రతి మూడురోజలకు ఒకసారి తప్పనిసరిగా ఒక నీటితడిని అందించాలి. సిఫారసు చేసిన ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లుగా అందించాలి.

వేసవిలో అరటి తోటల సంరక్షణ  : 
ఒకవేళ 1 లేక 2మాసాల వయస్సున్న మొక్కలు చనిపోయినట్లయితే వాటిని తీసివేసి జూన్, జూలై మాసాల్లో తిరిగి కొత్త వాటిని నాటుకోవాలి. 5మాసాలు పైబడిన తోటలు గెలలు వేయటానికి సమయం తక్కువగా వుంటుంది. కనుక ఇటువంటి తోటలకు క్రమం తప్పకుండా 3,4రోజులకు ఒక నీటితడి ఇవ్వాలి. ఎరువులను సిఫారసు కన్నా 50శాతం అదనంగా ఇచ్చినట్లయితే ఆరోగ్యవంతమైన గెలలు వస్తాయి.

ఒకవేళ గెలలు లేతదశలో వున్నట్లయితే ఎండ వేడిమికి ఎదుగుదల తగ్గుతుంది.ఈ దశలో వున్న తోటల్లో నష్టం ఎక్కువగా వుంటుంది. ఇలాంటి సమయంలో దగ్గరదగ్గరగా నీటి తడులను పెట్టాలి.నేల స్వభావాన్ని బట్టి తేలిక నేలలయితే 2నుంచి3రోజులకు…బరువు నేలలయితే 4నుంచి5రోజులకు ఒకసారి తడులను అందించాలి. డ్రిప్ ద్వారా అందించేటప్పుడు నీరు ఇచ్చే సమయం పెంచాలి.

మొక్కలకు నిర్ధేశించి ఎరువులను సకాలంలో అందించాలి. డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించినట్లయితే మొక్కలు పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటాయి. అవిశె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 3,4 వరుసల్లో అరటితోపాటు నాటుకున్నట్లయితే వేసవి వేడిగాలుల నుంచి మొక్కలను కాపాడవచ్చు. అరటి గెలలను ఆకులతో కప్పి వుంచినట్లయితే ఎండ వేడిమి నుంచి కాపాడబడి నాణ్యత తగ్గకుండా వుంటుంది.

ఒక్కోసారి గెలల బరువుకు మొక్కలు విరిగి పడిపోయే అవకాశం వుంది. కాబట్టి వెదురు కర్రలతో ఊతం కల్పించాలి. గెలలు ఎదుగుదల దశలో వున్నప్పుడు లీటరు నీటికి 5గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ను కలిపి ఆకులు, గెలలు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేసినట్లయితే నష్టాన్ని కొంత వరకు అధిగమించవచ్చు. కోత దశలో వున్న తోటల్లో ఉదయం పూట చల్లని వాతావరణంలో కోతలు జరిపి, గెలలను నీడలో ప్రదేశంలో వుంచుకోవాలి.

Read Also : Natural Farming : ప్రకృతి విధానంలో కొత్త ఒరవడి.. శబరి 555తో చీడపీలకు చెక్