Sajjala Ramakrishna Reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదేళ్ల సంక్షేమ పాలన వల్లే ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేసేందుకు వచ్చారని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మొదట రాద్ధాంతం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మౌనం వహిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల వేళ ప్రకటించిన పథకాలను ప్రజలు నమ్మలేదని అన్నారు.
ఎవరినీ భ్రమలో పెట్టాల్సిన అవసరం తమకు లేదని సజ్జల అన్నారు. సీఎం జగన్‌పైన వ్యతిరేకత లేదని తెలిపారు. 2019 ఎన్నికల్లో సాధించిన దానికంటే తమకు మెరుగైన మెజార్టీ వస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో అందించిన పథకాలు కొనసాగాలని ప్రజలు కోరుకున్నారని సజ్జల చెప్పారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు రోడ్లపైకి వచ్చారని అన్నారు.
పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత అధికారులను ఎక్కడ మార్చారో అక్కడే దాడులు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడి ఆదేశాలతో పురందేశ్వరి కేంద్రం వాళ్లతో మాట్లాడి ఇదంతా చేయిస్తున్నారనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రజల ఆకాంక్షల మేరకే వైసీపీ పనిచేస్తుందని సజ్జల తెలిపారు. తాడిపత్రిలో పోలీసులే సీసీ కెమెరా పగులకొట్టి హింసాకాండకు పాల్పడడం దారుణమని చెప్పారు. జగన్ పై చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతూ విషం చిమ్ముతూనే ఉన్నారని తెలిపారు. వైసీపీకి కుట్రలు చేయడం తెలియదని అన్నారు.
Also Read: ఎన్నికల తర్వాత అందుకే గొడవలకు దిగుతున్నారు: వైసీపీ నేతలు