Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రూ.310 కోట్లు నష్టపరిహారం ఇచ్చామని తెలిపారు. గిట్టుబాటు ధర కోసం రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు.
Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)
- అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల
- ప్రతి ఏటా రైతు ఖాతాలో 20 వేలు జమ
- ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ
Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. ప్రతీ ఏటా ఈ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా రూ.14 వేలు అందించగా.. ఇప్పుడు మూడో విడతలో రూ.6 వేలు జమ చేసింది.
రైతు సంక్షేమమే ధ్యేయం..
పీఎం కిసాన్ 3వ విడత నిధులు విడుదల చేశామన్నారు చంద్రబాబు. అసోం నుంచి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రైతులకు నిధులు విడుదల చేశారని తెలిపారు. కేంద్రం 6 వేలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు ఇస్తోందన్నారు. ప్రతి ఏటా రైతు ఖాతాలో 20 వేలు జమ చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.7,500 మాత్రమే ఇచ్చి అన్ని పథకాలు ఎగ్గొట్టిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రైతులకు ఇచ్చిందని వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు చంద్రబాబు.
ఎన్నికల ముందు తాను, పవన్ కల్యాణ్ రాష్ట్రం మొత్తం తిరిగి పునర్నిర్మిస్తామని, రైతులను ఆదుకుంటామని చెప్పామని చంద్రబాబు గుర్తు చేశారు. బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు. 3వ విడతలో 46.85 లక్షల మంది రైతులకు రూ.6 వేల చొప్పున జమ చేస్తున్నామన్నారు. ఈ ఒక్క విడతలోనే రూ.2,670 కోట్లు రైతుల అకౌంట్ లో వేశామన్నారు. ఇందులో రాష్ట్ర వాటాగా రూ.1874 కోట్లు ఇచ్చామన్నారు. మొత్తం కలిసి ఈ ఏడాదిలో ప్రతి రైతుకు రూ.20 వేలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది అని చంద్రబాబు అన్నారు.
”2025 ఆగస్ట్ 2న మొదటి విడత రూ.3,174 కోట్లు, నవంబర్ 19 రూ.3,135 కోట్లు కలిపి రూ.6309 కోట్లు ఇచ్చాం. 3వ విడత రూ.2,670 కోట్లు ఇచ్చాం. రూ.8,985 కోట్లు ఈ ఏడాది రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏన్డీఏ.
నేనూ రైతు బిడ్డనే.. వారి కష్టాలు తెలుసు
నేనూ రైతు బిడ్డనే. వ్యవసాయంలో నాకు ఎక్కువ కమిట్ మెంట్ ఉంటుంది. రైతుల కష్టాలు నాకు తెలుసు. అందుకే వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా. నా రైతు కుటుంబాలు ఇబ్బంది పడకూదనే ఉద్దేశంతో నిత్యం అండగా నిలుస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాం. కృష్ణా జిల్లాలో నీళ్లు సరిగ్గా లేక పంటలు వేయలేక పోయే వారు. నీళ్లు ఆలస్యంగా రావడంతో సాగు చేసినా తుఫాన్ల వల్ల పంటలు దెబ్బతిని రైతన్నలు ఇబ్బందులు పడ్డారు. ఏ విధంగానైనా న్యాయం చేయాలని పోలవరం కంటే ముందు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. దీంతో ముందే పంటలు వేయగలుగుతున్నారు.
ఆక్వా సాగుకు కూడా పుష్కలంగా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. దీంతో కృష్ణా జిల్లాలో వ్యవసాయం సుస్థిరం అయింది. గత పాలన వల్ల రాష్ట్రం అప్పుల సుడిగుండంలో ఉంది. పెట్టుబడులు పెట్టే వారు కూడా రాలేదు. బ్రాండ్ ను దెబ్బతీశారు. ఈ 20 నెలల్లో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. సమస్యలన్నీ పరిష్కరించామని నేను చెప్పడం లేదు. మీకు న్యాయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏనే. 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం.
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రూ.310 కోట్లు నష్టపరిహారం ఇచ్చాం. గిట్టుబాటు ధర కోసం రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. గిట్టుబాటు ధర రాక మామిడి రైతులు ఇబ్బంది పడ్డారు. పొగాకు రైతులకు రూ.200 కోట్లకు పైగా సాయం అందించాం. ఉల్లి రైతులకు హెక్టార్ కు రూ.50 వేలు ఇచ్చాం. టమాటా రైతులను, కోకో రైతులను ఆదుకున్నాం. రూ.1338 కోట్లు నష్టపోయిన రైతులకు అండగా నిలిచాం” అని చంద్రబాబు తెలిపారు.
Also Read: ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. వారసత్వ స్థలాల రిజిస్ట్రేషన్ మరింత ఈజీ.. జస్ట్ ఇలా చేస్తే చాలు..!
