BC Reservations : బీసీలకు 34శాతం కోటా.. ప్రత్యక్ష మేయర్ ఎన్నికలు.. రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ప్రకటన!
BC Reservations : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రూరల్‌లో 34శాతం అర్బన్‌లో 33.1శాతం రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రత్యక్ష మేయర్ ఎన్నికలు, 28 జిల్లా పరిషత్‌ల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు.
BC Reservations CM Chandrababu Naidu
- బీసీ రిజర్వేషన్ల అంశంపై శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం
- మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలి
- అక్టోబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
- 13 జడ్పీలను 28 జిల్లా పరిషత్‌లుగా ఏర్పాటుకు ఆమోదం
BC Reservations : బీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా రిజర్వేషన్లపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు :
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. బీసీల సంక్షేమం, సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మాత్రమే కాదన్నారు. టీడీపీ రాజకీయ సిద్ధాంతంలో భాగమని స్పష్టం చేశారు. నిర్ణయాధికారంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో తొలిసారిగా బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని పేర్కొన్నారు. 1995లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచినట్టు తెలిపారు. టీడీపీకి, బీసీలకు అవినాభావ సంబంధం ఉందని, బలమైన బీసీ నాయకత్వాన్ని పార్టీ ప్రోత్సహించిందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను 21 శాతానికి తగ్గించారని, బీసీ నాయకులను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన బీసీలను కూడా గతంలో వేధించారని అన్నారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు సహా పలువురు బీసీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు.
బీసీలకు భిక్ష అవసరం లేదని, చట్టబద్ధమైన హక్కుతో పాటు రాజకీయ భరోసా కావాలని వ్యాఖ్యానించారు. బీసీలకు మాటలు కాదు.. చట్టబద్ధమైన హక్కు కావాలన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వర్ల రామయ్య (ఎస్సీ)కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చామన్నారు. వడ్డెర కులానికి చెందిన శారదకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుకెళ్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.
ప్రత్యక్ష పద్ధతిలోనే మేయర్ ఎన్నికలు :
మేయర్ ఎన్నికల విధానంలోనూ ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఇకపై మేయర్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ప్రజలే ఎన్నుకునే విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. డిప్యూటీ మేయర్ పదవిని పాత విధానంలో ఒకరికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో పట్టణ పాలనలో మేయర్ ఎన్నికలు మరింత కీలకంగా మారనున్నాయి.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 13 జడ్పీల స్థానంలో 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టనుంది. కొత్త జిల్లాల పరిధికి అనుగుణంగా జడ్పీల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించనున్నారు.
