Russian Oil: రష్యా చమురు.. తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు భారత్ యత్నం

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ దిగుమతుల్ని రెట్టింపు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అది కూడా తక్కువ ధరలోనే చమురు కొనుగోలు చేయాలని చూస్తోంది.

Russian Oil: రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ దిగుమతుల్ని రెట్టింపు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అది కూడా తక్కువ ధరలోనే చమురు కొనుగోలు చేయాలని చూస్తోంది. రష్యాకు చెందిన రోస్‌నెస్ట్ అనే సంస్థ నుంచి అతి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో అమెరికాతోపాటు, యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలుపై నిషేధం విధించాయి.

Minor Girl Raped : ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్‌లో మరో మైనర్‌ బాలికపై అత్యాచారం

మెల్లిగా అనేక దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఆ మిగులు చమురును కొనాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై రష్యా చమురు సంస్థలతో భారత్ చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో సరఫరా వ్యవస్థ, బీమా పాలసీ వంటివి ఉన్నాయి. అలాగే ఎంతమేర సరఫరా ఉండవచ్చు.. ధర వంటి వివరాల్ని కూడా ఇరు దేశాలు చర్చిస్తున్నాయి. ఈ చర్చలు ఫలించి, ఒక్కసారి అంగీకారం కుదిరితే, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు దాదాపు రెట్టింపు అవుతుంది. చమురు కొనుగోళ్లకు అవసరమైన నిధులు అందించేందుకు భారతీయ సంస్థలు బ్యాంకులతోనూ చర్చిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ప్రధానంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నయర ఎనర్జీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇంకా తాజా ఒప్పందాలు ఖరారు కాకపోయినప్పటికీ, ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు రష్యా నుంచి 40 మిలియన్ బ్యారెళ్లకుపైగా ముడి చమురును భారత్ కొనుగోలు చేసింది.

 

ఇది 2021 మొత్తం దిగుమతుల కంటే 20 శాతం ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం మే నెలలో రోజుకు 7,40,000 బ్యారెళ్ల ముడి చమురును భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ఏప్రిల్‌లో రోజుకు 2,84,000 బ్యారెళ్లు సరఫరా అయ్యాయి. మొత్తంగా చూస్తే ఇప్పటికే రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు