ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ఎలక్షన్స్.. రికార్డు స్థాయిలో లక్షా 42 వేల కోట్లు ఖర్చు!

ఈసారి 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చు దాదాపు లక్షా 42వేల కోట్లు అయిందని అంచనా వేసింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్.

India general election 2024 expenditure: ఎన్నికలు అంటే పార్టీలు, అభ్యర్థులు, ప్రచారం, ఓటర్లే కాదు.. డబ్బు, మద్యం, ప్రలోభాలు కూడా. దేశంలో ఒక ఎన్నికలతో పోల్చితే మరో ఎన్నికలకు వచ్చేసరికి ఖర్చులు, ధనప్రవాహం భారీగా పెరిగిపోతోంది. ఈసారి ఎన్నికలకు ఏకంగా లక్షా 42 వేల కోట్లు ఖర్చు అయిందని అంచనా. ఈ ఖర్చు ఒక రాష్ట్ర బడ్జెట్‌కు సమానమంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అంతేకాదు ప్రపంచ దేశాల్లోనే ఇవే అత్యంత కాస్ట్‌లీ ఎన్నికలు అని తెలుస్తోంది.

బిజినెస్ మెన్ సినిమాలో హీరో మహేశ్ బాబు చెప్పిన డైలాగ్.. ప్రస్తుత ఎన్నికల ఖర్చుకు కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ఢిల్లీ నుంచి హైకమాండ్ దూత వచ్చినప్పుడు ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్తూ మహేశ్ సూపర్ డైలాగ్‌ చెబుతాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఉద్ధేశిస్తూ అన్నీ ఛండీగఢ్, ఛత్తీస్గఢ్‌ లెక్కలు చెబుతావేంటి..ఇప్పుడు ఓటు 500కు రాదు.. ఒక్కోసెంటర్లో 5 వేలు కూడా పెట్టి కొనాల్సి ఉంటుందని.. 2012లో చెప్పాడు. ఈసారి ఎన్నికల ఖర్చును చూస్తే.. ఆ డైలాగ్ కరెక్టేనని అనిపిస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచే విషయం అంటుంచితే.. సోషల్ మీడియా మెయింటెనెన్స్ నుంచి సభలు, సమావేశాల వరకు ప్రతీది ఖర్చుతో కూడుకున్న విషయమే.

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే అతిపెద్ద పండగగా భావిస్తారు. ఇక భారత్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. అయితే రాను రాను మనదేశంలో ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చు దాదాపు లక్షా 42వేల కోట్లు అయిందని అంచనా వేసింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. ఈ లెక్కన వరల్డ్లోనే మన ఎన్నికలు రిచ్చెస్ట్ ఎలక్షన్స్‌గా అంచనా వేశారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు.. 60 వేల కోట్లు. ఈసారి లోక్‌సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా లక్షా 42వేల కోట్లకు చేరుకున్నట్లు CMS అంచనా వేసింది. అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల్లో అయిన ఖర్చు లక్షా 20వేల కోట్లు. అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా కంటే కూడా మన ఎలక్షన్స్ ఖర్చు ఇంకో 22వేల కోట్లు ఎక్కువ. మనదేశంలో మొత్తం 96కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఒక్కో ఓటరుకు రూ.1400 ఖర్చు అయినట్లు నిపుణుల అంచనా. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయిన రూ.60 వేల కోట్లతో పోలిస్తే ఈసారి డబుల్ కంటే.. ఇంకో 22వేల కోట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలోని ఎన్నికల్లో పెట్టే ఖర్చుకు సంబంధించి సెంటర్‌ ఫర్ మీడియా స్టడీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ.. 35 ఏళ్లుగా గమనిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో భారీగా ఖర్చు అయినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ ఛైర్మన్‌ భాస్కర్‌ రావు అంచనా వేశారు. అయితే ఈ ఖర్చులో ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పోటీ చేసే అభ్యర్థులు.. వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయని తెలిపారు.

ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెట్టే ఖర్చులన్నింటిని కలిపి ఇందులోకి వస్తాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో బీజేపీనే అత్యధికంగా పబ్లిసిటీ కోసం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల ఖర్చును తొలుత రూ.1.2 లక్షల కోట్లుగా అంచనా వేశామని.. కానీ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటికి వచ్చిన తర్వాత.. అంచనాలను లక్షా 42వేల కోట్లకు పెంచింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే కాదు.. అనేక మార్గాల్లో పార్టీలకు డబ్బు చేరుతుంది. 2004 నుంచి 2023 వరకు దేశంలోని ఆరు ప్రధాన పార్టీలకు రూ.19వేల కోట్ల రూపాయలు రహస్య విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది.

ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, రవాణా, జనసమీకరణ, ఇన్ ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు, లీడర్లకు ముడుపులు, టీవీలు, పేపర్లలో ప్రకటనలు, గోడలపై రాతలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, డిజిటల్ క్యాంపెయిన్ వంటి వాటికి పార్టీలు, అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు CMS తెలిపింది. ఈ లక్షా 42వేల కోట్ల ఎన్నికల ఖర్చులో.. ఎన్నికల సంఘం పెడుతున్న ఖర్చు 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేసింది CMS. మొత్తం ఎన్నికల ఖర్చులో 30 శాతం మీడియా క్యాంపెయిన్కే అవుతున్నట్టు అంచనా వేశారు. సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కంటికి కనిపించకుండా తెరవెనుక జరుగుతోన్న ఖర్చును లెక్కిస్తే అంచనాలు ఇంకా ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది.

Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. విస్మయానికి గురిచేస్తున్న ఎన్నికల అధికారుల ఖర్చు

భారత రాజకీయాల్లో ఐడియాలజీ కంటే మనీ పవర్ కే ప్రాధాన్యం పెరుగుతోందని నెక్స్ట్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ఎలక్షన్స్ పుస్తకంలోనూ భాస్కరరావు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయని, ఎన్నికల్లో ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో బ్రాండింగ్ చేయించుకుంటున్నాయని తెలిపారు. ఫేస్ బుక్, గూగుల్ వంటి కంపెనీలు కూడా పొలిటికల్ క్యాంపెయిన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్.

ట్రెండింగ్ వార్తలు