Jammu Kashmir Cloud Burst: జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. 33మంది భక్తులు మృతి.. ఆలయానికి వెళ్లే సమయంలో ఘోరం..
మచైల్ మాతా ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఉంది. (Jammu Kashmir Cloud Burst)

Jammu Kashmir Cloud Burst: జమ్ముకశ్మీర్ కిష్ట్వార్ లో క్లౌడ్ బరస్ట్ ఏర్పడింది. దీంతో భారీ వరదలు సంభవించాయి. ఈ ఘటనలో మరణించిన భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 33మంది చనిపోయారు. మచైల్ మాతా ఆలయానికి వెళ్లే దారిలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. క్లౌడ్ బరస్ట్ తో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఆలయం..
కిష్ట్వార్ లో సంభవించిన మెరుపు వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మచైల్ మాతా ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్ము డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వచ్చారు. సెప్టెంబర్ 5న ఈ యాత్ర ముగియనుంది.
మెరుపు వరదల ఘటనలో 220 మంది యాత్రికులు గల్లంతయ్యారు. 120 మంది గాయపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి.
వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం యాత్రను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కిష్త్వార్ ప్రాంతంలో పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించానని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు. అవసరమైన వారికి సాధ్యమైన ప్రతి సాయం అందించబడుతుందన్నారు.
మందిరం సమీపంలోని చోసిటిలో జరిగిన ఈ సంఘటన గణనీయమైన ప్రాణనష్టానికి దారితీయవచ్చు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్‌ఓపీ, స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ నుండి అత్యవసర హెచ్చరిక అందిన తర్వాత డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మతో మాట్లాడానని ఆయన చెప్పారు.