UPSC Topper: యూపీఎస్సీ ఫలితాలు.. డాక్టర్ నుంచి టాపర్ గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రి.. అతడి సక్సెస్ సీక్రెట్ ఇదే
UPSC Topper 2025 Anuj Agnihotri: యూపీఎస్సీ ఫలితాలు విడుదల చేశారు. ఈసారి అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆయన పూర్తి వివరాలు..
upsc cse result 2025 topper anuj agnihotri profile
UPSC Topper Anuj Agnihotri: దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలుగా గుర్తింపు తెచ్చుకున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాలు మార్చి 6న విడుదలయ్యాయి. మొత్తం 1,087 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించగా, 958 మంది తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 2025లో జరిగిన రాత పరీక్ష, ఆ తర్వాత డిసెంబర్ 2025లో మెయిన్స్, ఫిబ్రవరి 2026 మధ్య నిర్వహించిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)ల అనంతరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 తుది ఫలితాలను నేడు విడుదల చేశారు. అధికారిక నోటీసు ప్రకారం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) వంటి వివిధ కేంద్ర సర్వీసులకు నియామకం కోసం మొత్తం 958 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా ఎంపికైన వారిలో అనుజ్ అగ్నిహోత్రి జనరల్ కేటగిరీలో ఆలిండియా 1వ ర్యాంక్ సాధించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అనుజ్ అగ్నిహోత్రి, ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించాలనే ఉద్దేశంతో సివిల్స్ వైపు అడుగులు వేశారు. పట్టుదలగా చదివి డాక్టర్ నుంచి టాపర్‌గా ఎదిగి తన సత్తా చాటారు.
MBBS టూ సివిల్స్..
అనుజ్ అగ్నిహోత్రి వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే, ఆయన స్వస్థలం రాజస్థాన్‌లోని కోట సమీపంలో గల రావత్భట అనే చిన్న పట్టణం. ఉన్నత విద్య కోసం జోధ్‌పూర్‌కు వెళ్లే ముందు అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) జోధ్‌పూర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2023లో వైద్య పట్టా పొందిన తర్వాత ఆయన సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించారు. దీని గురించి ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూ వీడియోలో ఆయన ఆసక్తిక వివరాలు పంచుకున్నారు. సివిల్స్ ప్రిపరేషన్ తన వైద్య చదువులకు భిన్నమైన సవాళ్లను పరిచయం చేసిందని తెలిపారు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ దశ.. తన ఐదు సంవత్సరాల ఎంబీబీఎస్ చదువుల కంటే చాలా కష్టంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.
తాను సివిల్ సర్వీసెస్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆ పదవి ద్వారా లభించే బాధ్యతలు అని, ఈ సర్వీసులో చేరితే దేశవ్యాప్తంగా ప్రజలకు నేరుగా సేవ చేయవచ్చనే ఉద్దేశంతోనే ఈ దిశగా వచ్చినట్లు అనుజ్ అగ్నిహోత్రి తెలిపారు. విభిన్నమైన కెరీర్‌ను కొనసాగించాలనే కోరికతో పాటు, పాలనలోని వివిధ రంగాలకు సంబంధించిన అనుభవం లభిస్తుందనే ఉద్దేశంతోనే దీనిని ఎంచుకున్నట్లు చెప్పారు.
సక్సెస్ కి కారణం ఇదే..
సివిల్స్ ప్రిపరేషన్ సమయంలో మొబైల్, సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండి కేవలం చదువు మీద మాత్రమే దృష్టి సారించినట్లు తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. చదువుతో పాటు అనుజ్ అగ్నిహోత్రికి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం, అలాగే స్టాండ్-అప్ కామెడీ చూడటంపై కూడా ఆయనకు ఆసక్తి ఉంది. ఈ పోటీ పరీక్షలో ఆయన జనరల్ కేటగిరీ కింద పాల్గొని అద్భుత విజయాన్ని అందుకున్నారు.
