Indian Railways : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖ బిగ్ డెసీషన్.. ఇక నుంచి డోర్ టు డోర్ పార్సల్ సేవలు..
Indian Railways Door to Door Parcel Service : భారతీయ రైల్వే కొత్తగా ఇంటి నుంచి ఇంటికి పార్సిల్ డెలివరీ సేవను ప్రారంభించనుంది. హైదరాబాద్ సహా 8 నగరాల్లో రైల్ పార్సిల్ యాప్ ద్వారా బుకింగ్, పికప్, డెలివరీ సౌకర్యం కల్పించనుంది.
Indian Railways Door to Door Parcel Service
Indian Railways Door to Door Parcel Service : రైల్వేలో పార్సిల్ పంపించాలంటే ఇప్పటివరకు స్టేషన్‌కు వెళ్లడం, అక్కడ బుకింగ్ చేయడం, పార్సిల్‌ను రైల్వే సిబ్బందికి అప్పగించడం వంటి పనులు ఉండేవి. ఇకపై ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే కొత్త సేవను తీసుకొస్తోంది. ఇంటి వద్ద నుంచే పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది. పార్సిల్‌ను మీ ఇంటి వద్దే తీసుకుని, రైలు ద్వారా గమ్యస్థానానికి చేర్చి, అక్కడి నుంచి నేరుగా చిరునామాకు డెలివరీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘రైల్ పార్సిల్ యాప్ – ఘర్ సే ఘర్ తక్’ను అందుబాటులోకి తీసుకురానుంది.
భారతీయ రైల్వే ఈ ప్రక్రియను తొలుత ఎనిమిది ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తేనుంది. వాటిలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, పుణె ఉన్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన సేవల అనుభవం ఆధారంగా ఈ కొత్త విధానాన్ని విస్తరించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
పార్శిల్ బుకింగ్.. డెలివరీ ప్రక్రియ స్టెప్ బై స్టెప్ ఇలా..
♦ భారతీయ రైల్వే అందుబాటులోకి తేనున్న డోర్ టూ డోర్ పార్శిల్ డెలివరీ సేవలో ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.
♦ పార్సిల్ పంపాలనుకునే వారు ప్రత్యేక యాప్ లేదంటే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.
♦ తొలుత లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు పార్సిల్ పంపించే వ్యక్తి ఇంటికి వచ్చి దానిని సేకరిస్తారు. అవసరమైతే ప్యాకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తారు.
♦ ఆ తరువాత సేకరించిన పార్సిల్‌ను రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి రైలు ద్వారా గమ్యస్థానానికి చేరవేస్తారు.
♦ గమ్యస్థాన రైల్వే స్టేషన్లో మరో లాజిస్టిక్స్ సంస్థ పార్సిల్‌ను తీసుకుని, దానిని సంబంధిత వ్యక్తి ఇంటికి లేదంటే ఇచ్చిన చిరునామాకు అందిస్తుంది.
♦ రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందు నుంది రైలు బయలుదేరడానికి ఒకరోజు ముందు వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
♦ బుక్ చేసిన పార్సిళ్లను లాజిస్టిక్స్ సంస్థలు రైలు బయలుదేరడానికి కనీసం గంట ముందు రైల్వే సిబ్బందికి అప్పగించాలి. దీంతో పార్సిళ్ల రవాణా ప్రక్రియను సులభతరం చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
♦ ఒకవేళ పార్సిల్ బుకింగ్ చేసుకున్న తర్వాత దానిని రద్దు చేసుకోవాలనుకుంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.
♦ పార్సిల్‌ను లాజిస్టిక్స్ సంస్థలు ఇంటి నుంచి సేకరించకముందే బుకింగ్ రద్దు చేస్తే రైల్వే రవాణా ఛార్జీని తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందులో రూ.10 క్లర్కేజీ ఛార్జీ మినహాయిస్తారు.
♦ ఇంటి నుంచి పార్సిల్ సేకరణ, చివరి చిరునామాకు డెలివరీకి సంబంధించిన ఛార్జీల రీఫండ్ మాత్రం సంబంధిత లాజిస్టిక్స్ సంస్థల నిబంధనల ప్రకారం ఉంటుంది.
♦ ఈ కొత్త సేవకు సంబంధించిన యాప్, వెబ్‌సైట్‌ను రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (CRIS) అభివృద్ధి చేస్తోంది.
♦ అవసరమైన పరీక్షలు పూర్తయిన తర్వాత డోర్ టూ డోర్ పార్శిల్ డెలివరీ సేవల ప్రారంభ తేదీని రైల్వే శాఖ ప్రకటించనుంది.
