తిరుమల, బాసర పుణ్యక్షేత్రాల్లో పెరిగిన భక్తుల రద్దీ ..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం ..

Tirumala Tirupati Devasthanams : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తికావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రముఖ దేవాలయాకు వెళ్లి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లు ఉన్నాయి. టోకెన్ లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 30గంటల సమయం పడుతుంది. శనివారం స్వామివారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.28కోట్లు సమకూరింది. 50,599 శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు పోటెత్తారు.

భక్తుల రద్దీతో సందడిగా మారిన శ్రీశైలం
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. సెలవు రోజులు కావడంతో స్వామి అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.

Also Read : Tirumala Information : వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

భక్తులతో బాసర కిటకిట
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఏకాదశి, ఆదివారం కలిసి రావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. చిన్నారులతో అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శనానికి 2గంటల సమయం పడుతుంది.

Also Read : Lavanya Tripathi : ప్రకృతిలో కట్టెల పొయ్యి వెలిగించి టీ పెట్టుకుంటున్న మెగా కోడలు లావణ్య..

యాదగిరిగుట్ట భక్తుల రద్దీ
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తమకు మంచి కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి చాలా మంది క్యూలైన్లలో బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు