Rang Panchami : మార్చి 8 రంగ్ పంచమి.. దేవతలు భూమి మీదకు వచ్చి హోలీ ఆడే పండగ.. ఆ రోజు ఇలా చేస్తే ఇక తిరుగుండదు
Rang Panchami : హోలీ పండగ నాడు మనం రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటాము. కానీ దేవతలే స్వయంగా భూమి మీదకు దిగి వచ్చి హోలీ ఆడే పండగ గురించి మీకు తెలుసా..
rang panchami 2026 date muhurat significance details here
Rang Panchami : హిందువులకు ఎన్నో పండగలు, పర్వదినాలు ఉంటాయి. సాధారణంగా ప్రతి నెలా చిన్నవో, పెద్దవో పండగలు వస్తూనే ఉంటాయి. ఈ మార్చి నెలలో ఎన్నో ముఖ్యమైన పండగలు వచ్చాయి. వీటిల్లో హోలీ, ఉగాది, శ్రీరామనవమి వంటి పండగలు ఉన్నాయి. మార్చి 4న హోలీ పండుగ అయిపోయింది. మార్చి 8, ఆదివారం రంగ పంచమి. మరి ఇదేం పండగ అంటే, ఇది హోలీకి కొనసాగింపు పర్వదినం. దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో.. అలానే హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివరి నాడు జరిపే పండగే రంగ పంచమి.
హోలీ మాదిరిగానే ఈ పండగకు కూడా రంగులు చల్లుకుని సంతోషంగా గడుపుతారు. అయితే ఈ పండగకు మరో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రంగ పంచమి నాడు స్వయంగా దేవతలు భూమి మీదకు దిగి వచ్చి.. హోలీ ఆడతారని నమ్ముతారు. అందుకే ఈ పండగను దేవ పంచమి అని కూడా అంటారు. కార్తీక పూర్ణిమను దేవతల దీపావళి అని ఎలా నమ్ముతారో.. ఈ రంగ పంచమిని కూడా దేవతల హోలీగా విశ్వసిస్తారు. ఈ రోజున రంగులతో ఆడుకోవడం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా సానుకూల శక్తి వ్యాప్తి చెందుతుందని.. దీని ద్వారా జనాలు.. దేవతల స్పర్శను అనుభూతి చెందుతారని పండితులు చెబుతున్నారు.
అయితే ఈ రంగ పంచమి దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకోరు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధుర, బృందావనం ప్రాంతాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు. హోలీ పండగ తర్వాత 5వ నాడు జరుపుకునే రంగ పంచమి ఈ సారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రావడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
రంగ పంచమి తిథి:
హిందూ పంచాంగం ప్రకారం ఈ రంగ పంచమి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, కృష్ణ పక్ష పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది రంగ పంచమి తిథి మార్చి 7న సాయంత్రం 07:17 గంటలకు మొదలై.. మార్చి 8 రాత్రి 09:10 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం పండగ జరుపుకోవాలి కాబట్టి.. మార్చి 8న రంగ పంచమి జరుపుకుంటారు.
రంగ పంచమి రోజున దేవతలు హోలీ ఆడటం కోసం భూమి మీదకు వస్తారని ప్రతీక. అలా వచ్చిన దేవతలు భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తారని నమ్ముతారు. ఈ రంగ పంచమి రోజున దేవుళ్లతో హోలీ ఆడటం వల్ల మన జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోతాయని.. జీవితంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తారు. రంగ పంచమి నాడు గాల్లోకి రంగులు, గులాల్ను ఎగరవేయడం ద్వారా భక్తులు.. దేవతలతో కలిసి హోలీ ఆడతారని.. ఫలితంగా.. భక్తుల జీవితంలోని కోరికలన్నీ తీరి.. కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
