అదుపులేని ఎన్నికల వ్యయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అంత ఖర్చా!

ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపైనే అందరి ఫోకస్‌ ఉంటుంది. ఎక్కడ, ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయమై ప్రతిఒక్కరూ డేగ కళ్లతో చూస్తుంటారు. మరి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చెంత?

Telangana Assembly Election 2023 expenditure: ఎన్నికలు అనగానే.. పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చుపైనే అందరి ఫోకస్‌ ఉంటుంది. ఎక్కడ, ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయమై ప్రతిఒక్కరూ డేగ కళ్లతో చూస్తుంటారు. మరి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చెంత? ఒక్కో నియోజకవర్గానికి సగటున ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? ఎన్నికల నిర్వహణ వ్యయంపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సేకరించిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్నికల పేరుతో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగమవుతుందో బయటపెట్టింది ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ నివేదిక.

ఆడిట్‌ లేకపోవడంతో విచ్చలవిడి ఖర్చు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు చేసిన ఖర్చు విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడైంది. అంటే ఒక్కో నియోజకవర్గానికి సగటున ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా దాదాపు పది కోట్లు కూడా ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చుపై ఆడిట్‌ లేకపోవడంతో కొందరు అధికారులు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ బయటపెట్టింది. తెలంగాణ ఎన్నికల్లో చేసిన ఖర్చుపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సేకరించిన వివరాలను బయటపెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

నిధులపై లెక్క చెప్పాల్సిన అవసరం లేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. అయితే చాలామంది అభ్యర్థులు ఈ ఖర్చుకు వందల రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తారనేది బహిరంగ రహస్యం. కానీ, అధికారికంగా అభ్యర్థులు సమర్పించే లెక్కలు మాత్రం 20 నుంచి 30 లక్షలు వరకు ఉంటాయి. ఇలా ఖర్చు చేసిన డబ్బంతా ఎక్కడి నుంచి సేకరించింది? ఎలా సేకరించింది? దేనికి ఖర్చు చేసింది? అన్న వివరాలను సమర్పించాల్సివుంటుంది. కానీ, ఎన్నికల నిర్వహణకు ఈసీ విడుదల చేసే నిధులపై లెక్క చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో ఉద్యోగులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన నిధులతోపాటు జిల్లా కలెక్టర్లు వద్ద ఉండే సాధారణ నిధులు కూడా ఎన్నికల నిర్వహణలో భాగంగా ఖర్చు చేస్తుంటారు. ఇలా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏడు వందల కోట్లు ఖర్చు చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

Also Read: మెట్రో నగరాలపై విపరీతంగా పెరుగుతున్న జనభారం

ఒక్కో నియోజకవర్గానికి రూ.ఆరు కోట్ల వ్యయం
ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే అధికారులు చేసే వ్యయంపై ఎటువంటి తనిఖీ, అడిట్‌ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది నవంబరు 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు చేసిన ఖర్చు అధికారికంగా కోటి 20 లక్షల రూపాయల వరకు ఉంటే.. అధికారులు మాత్రం సగటున ఆరేసి కోట్లు ఖర్చు చేయడమే ఇప్పుడు హాట్‌టాపిక్‌ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు