Rythu Bharosa Scheme : రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై ప్రభుత్వం కీలక ప్రకటన.. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడేది ఈ తేదీల్లోనే…
Rythu Bharosa Scheme : రైతు భరోసా నిధులకోసం గత కొన్ని నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నారు.. అయితే, ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది.
Rythu Bharosa Scheme
- రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్
- ఈనెలాఖరులో రైతుల ఖాతాల్లోకి నిధులు
- రెండు విడతల్లో నిధులు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు
Rythu Bharosa Scheme : రైతులకు పంటల సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రబీ సీజన్‌కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో రైతు భరోసా నిధుల కోసం గత కొన్ని నెలలుగా తెలంగాణ అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.. అయితే, ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మొత్తం రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులను అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఈ నిధులను రెండు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా రూ.4500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని.. మిగిలిన రూ.4500 కోట్ల నిధులను వచ్చే నెలలో మిగిలిన రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు.
ప్రతీసారి రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల ఖాతాల్లో దశల వారీగా ప్రభుత్వం జమ చేస్తోంది. తొలుత ఎకరం నుంచి రెండు ఎకరాలు కలిగిన రైతులకు.. ఆ తరువాత నాలుగు ఎకరాలలోపు.. ఆ తరువాత ఐదు ఎకరాల వరకు కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేస్తోంది. ఈ సారి రబీకి సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెలా చివరి వారంలో మూడు ఎకరాల లోపు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు, ఐదు ఎకరాలలోపు రైతులకు ఏప్రిల్ నెల మొదటి వారం లేదా రెండో వారంలో జమ చేస్తారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు రైతులతో కలిసి ఆందోళనలు నిర్వహించాయి. రైతు భరోసా పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా.. దఫాల వారిగా రెండు లేదా మూడు విడతల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
