Kim Daughter At Missile Launch Site : ఖండాంతర క్షిపణి ప్రయోగం కంటే కిమ్ కూతురిపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ.. క్షిపణి ప్రయోగమా? వారసురాలి ప్రకటనా?

ఖండాంతర క్షిపణి ప్రయోగం తో మరోసారి అమెరికాకు సవాల్ విసురుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్షిపణి ప్రయోగ స్థలానికి తన కూతురుని తీసుకుని రావటంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. సాధారణంగా కిమ్ ప్రయోగించే క్షిపణులపైనే ప్రపంచం దృష్టి ఉంటుంది. కానీ తాజాగా కిమ్ ప్రయోగించిన ఖండాంత క్షిపణి ప్రయోగంకంటే ఆయన కూతురిపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇది క్షిపణి ప్రయోగమా? నా వారసురాలు ఆమే అని ప్రకటించటమా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

Kim Daughter Kim Chu-ae At Missile Launch Site : బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న ఖండాంతర క్షిపణి. విశాల మైదానంలో తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్న కూతురు. ఈ ఫొటోతో ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన దేశంతో పాటు ప్రపంచానికి ఏం చెప్పదల్చుకున్నారు? శత్రుదేశం అమెరికాను ఢీకొట్టగల క్షిపణి ప్రయోగం జరిగే ప్రదేశానికి…కూతురిని తీసుకుని కిమ్ ఎందుకొచ్చారు? ఉత్తరకొరియాకు కాబోయే అధ్యక్షురాలు, తన వారసురాలు ఆమే అని..కిమ్ ఈ ఫొటోతో స్పష్టం చేశారా..?

12, 13 ఏళ్ల వయసున్న కూతురిని ఏ తండ్రి అయినా తన వెంట స్కూల్‌కో, పార్క్‌కో తీసుకెళ్తారు. మారాం చేస్తే సినిమాకో, రెస్టారెంట్‌కో తీసుకెళ్తారు. కానీ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన కుమార్తెను తీసుకుని ఓ ప్రమాదకర ప్రదేశానికి వచ్చారు. ఆయన తనయతో కలిసి ఇలా ప్రపంచానికి…ఆ మాటకొస్తే..తన దేశ ప్రజలకు కనిపించడం ఇదే తొలిసారి. అందుకే అమెరికాపై దాడి చేసే సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి ప్రయోగం కన్నా…కిమ్ కూతురిపైనే ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కిమ్ కుమార్తె పేరు కిమ్‌ చు-ఏ (Kim Chu-ae). కిమ్‌కు ఉన్న ముగ్గురు పిల్లల్లో ఆమే పెద్దదని ప్రచారం జరుగుతోంది. కిమ్ భార్యాపిల్లల గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అసలు కిమ్‌కు ఎంత మంది పిల్లలన్నది కూడా ఎవరికీ తెలియదు. కిమ్ చు-ఏను తీసుకుని కిమ్ జోంగ్ ఉన్ బయటకు వచ్చిన తర్వాతే..ఆయనకు చు-ఏతో పాటు మరో కుమార్తె, ఓ కొడుకు ఉన్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు.

కిమ్ జోంగ్ ఉన్ వ్యూహాత్మకంగానే….కూతురిని క్షిపణి ప్రయోగస్థలికి తీసుకొచ్చారని భావిస్తున్నారు. క్షిపణి ప్రయోగాలు, దేశ రక్షణ అవసరాలు, శత్రవులను ఎదుర్కొనే పద్ధతి వివరించడం ద్వారా…కూతురిని తన వారసురాలిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ ఉండగా, తండ్రీకూతుళ్లిద్దరూ చేతిలోచేయివేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోతో పాటు అధికారులతో మాట్లాడుతున్న ఫొటో, క్షిపణులను పరిశీలిస్తున్న ఫొటో, క్షిపణి ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఫొటోలను ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ ICNA ప్రచురించింది. కిమ్-చు-ఏను ఉత్తరకొరియా భావి అధ్యక్షురాలి తరహాలోనే ఆ దేశ మీడియా చూస్తోంది. నాలుగో తరం నాయకత్వం కూడా తమ వంశం వారే అన్నది చెప్పడమే కిమ్ జోన్ ఉద్దేశమని భావిస్తున్నారు.

కూతురుతో కిమ్ బయట కనిపించడంపై జరుగుతున్న మరో ప్రచారం…ఆయన ఆరోగ్యం గురించి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిమ్..కూతురిని నాయకురాలిగా తయారుచేసే పనిలో ఉన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. అలాగే..కిమ్‌ కన్నా శక్తిమంతురాలిగా భావించే ఆయన సోదరి కిమ్ యో జోంగ్‌కు చెక్ పెట్టే వ్యూహమన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కిమ్‌ జోంగ్ ఉన్‌కు ఏదన్నా జరిగితే…ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఉత్తరకొరియా అధ్యక్షురాలవుతారన్నది అందరి అభిప్రాయం. కానీ తన వారసత్వం కూతురికే చెందుతుందని, సోదరికి కాదని…ఈ ఫొటోలతో కిమ్ తేల్చిచెప్పినట్టయంది.

 

ట్రెండింగ్ వార్తలు