IPL 2024 – KKR vs MI : ముంబై చిత్తు.. కోల్‌కతా సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్‌కు అర్హత!

IPL 2024 - KKR vs MI : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఫలితంగా కేకేఆర్ 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలిజట్టుగా నిలిచింది.

IPL 2024 : KKR vs MI ( Image Credit : @IPL20.com/Twitter/TataIPL

IPL 2024 – KKR vs MI : ఐపీఎల్ 17 సీజన్‌లో కోల్‌కతా అదరగొడుతోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఫలితంగా కేకేఆర్ పాయింట్ల పట్లికలో 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది.

ప్రారంభంలో వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను కాస్తా 16 ఓవర్లకు కుదించారు. ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ దిగిన కోల్‌కతా 157 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు ముంబైకి 158 పరుగుల టార్గెట్ విధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది. నిర్ణీత 16 ఓవర్లలో ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరాజయం పాలైంది.

ముంబై ఓపెనర్ ఇషాన్ కిషాన్ (40) పరుగులతో రాణించగా, 6.5 ఓవర్‌లో సునీల్ నరైన్ వేసిన బంతిని షాట్ ఆడబోయి రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (19) పరుగులకే చేతులేత్తేశాడు. ముంబై 67 స్కోరు వద్ద 7.5 ఓవర్లలో వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని ఆడబోయి సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు.

మిగతా ఆటగాళ్లలో తిలక్ వర్మ (32) పరుగులతో పర్వాలేదనిపించాడు. నమన్ దీర్ (17), సూర్యకుమార్ యాదవ్ (11) పరుగులు చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) సింగిల్ డిజిట్‌కే చేతులేత్తేశాడు. టిమ్ డేవిడ్ మాత్రం ఖాతానే తెరవలేదు. నేహాల్ వదేరా (3; రనౌట్), అన్షుల్ కాంబోజ్ (2 నాటౌట్), పీయూష్ చావ్లా (1 నాటౌట్)కు పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకున్నారు.

కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా, సునీల్ నరైన్ ఒక వికెట్ తీసుకున్నాడు. ముంబై పతనాన్ని శాసించిన వరుణ్ చక్రవర్తి (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

వెంకటేష్ అయ్యర్ టాప్ స్కోరు :
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌కు 158 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (6) పరుగులకే చేతులేత్తేయగా, సునీల్ నరైన్ ఖాతా తెరవకుండానే నిష్ర్కమించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ (42; 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్)తో విజృంభించి టాప్ స్కోరరుగా నిలిచాడు.

మిగతా ఆటగాళ్లలో నితీష్ రాణా (33), ఆండ్రీ రస్సెల్ (24), రింకూ సింగ్ (20), రమణదీప్ సింగ్ (17; నాటౌట్) రాణించగా, శ్రేయస్ అయ్యర్ (7), మిచెల్ స్టార్క్ (2; నాటౌట్) పరుగులకే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, జస్ర్పిత్ బుమ్రా చెరో 2 వికెట్లు, నువాన్ తుషార, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీసుకున్నారు.

అగ్రస్థానంలో కోల్‌కతా.. ప్లే ఆఫ్స్‌కు అర్హత :
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 గెలిచి 3 ఓడి మొత్తం 18 పాయింట్లతో టాప్ ప్లేసులో నిలిచి ఫ్లే‌ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 7 ఓడి మొత్తం 10 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు