Huzurabad : బీజేపీ నేతల్లో గెలుపు ధీమా..కారణం ఏంటీ ?

ఈటల రాజేందర్ వ్యూహాలకు రాష్ట్ర, జాతీయ పార్టీలు సైతం సహాయం అందిస్తున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కోసం రాష్ట్ర నాయకత్వం భారీ టీమ్‌నే సిద్ధం చేసింది.

Huzurabad Bypoll : ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ ఉప ఎన్నిక మొదటి నుండి ఆసక్తి రేపుతోంది. తన రాజకీయ భవిష్యత్‌ తేల్చే ఎన్నిక కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మాజీ మంత్రి ఈటల. హుజరాబాద్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామంటూ ప్రకటించారు. ఎలాగైనా గెలిచితీరేలా.. వ్యూహాలు రచిస్తున్నారాయన. ఈటల రాజేందర్ వ్యూహాలకు రాష్ట్ర, జాతీయ పార్టీలు సైతం సహాయం అందిస్తున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నిక కోసం రాష్ట్ర నాయకత్వం అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసినట్లుగా కమలనాథులు చర్చించుకుంటున్నారు. ఉప ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కోసం రాష్ట్ర నాయకత్వం భారీ టీమ్‌నే సిద్ధం చేసింది.

Read More : AP YCP : రాజమండ్రి వైసీపీ నేతల పంచాయితీ..వివాదానికి ఫుల్ స్టాప్!
ఏకంగా ఇరవై రెండు కమిటీలను ఉప ఎన్నిక కోసం నియమించింది. హుజురాబాద్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.. కో-ఇన్‌చార్జ్‌లుగా మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారు. హుజూరాబాద్‌కు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసేందుకు నలుగురితో కమిటీని ఏర్పాటు చేసింది కమలం పార్టీ. లోపాలను ఎత్తి చూపేందుకు సైతం ముగ్గురితో ఛార్జ్ షీట్ కమిటీ పనిచేస్తోంది. ఇప్పటి వరకు అంతా అనుకున్నట్లే జరుగుతోందని.. హుజూరాబాద్ పూర్తిగా తమ కంట్రోల్లోనే ఉందంటున్నారు బీజేపీ నేతలు. అయితే.. బండి సంజయ్‌ పాదయాత్రకు మాత్రం ఎన్నికల కోడ్‌ కష్టాలు తప్పేలా లేవు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని.. హుజూరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర పెద్దలనూ ఆహ్వానించారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కోడ్‌ నిబంధనలు విధించింది ఈసీ. నియోజకవర్గంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేదంటూ నిబంధనలు పెట్టింది. అక్టోబర్‌ 2న హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించిన బీజేపీకి.. ఈసీ నిబంధనలు షాక్‌ ఇచ్చినంత పని చేశాయి.

Read More : IPL 2021 PBKS Vs MI.. ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు

దీంతో.. డైలమాలో పడింది కమలదళం. హుజూరాబాద్‌కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. పాదయాత్ర రూట్ మ్యాప్‌ ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తోంది. హుజూరాబాద్‌కు వెళ్లకుండా హుస్నాబాద్‌కు వెళ్తే ఎలా ఉంటుందన్న దానిపైనా కమలం నేతల్లో చర్చ జరుగుతోందట. అక్టోబర్‌ 2న ఎలాగైన సభ నిర్వహించి తీరాలని ధృడ నిశ్చయంతో ఉన్న బీజేపీ.. హుజూరాబాద్‌కు సమీపంలోనే సభకు ప్లాన్‌ చేస్తోంది. హుజూరాబాద్‌లో గెలుపు బీజేపీకి నల్లేరు మీద నడకేనంటోంది కమలం దండు. విక్టరీపై ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు. మొదటి నుంచి హుజూరాబాద్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కమలనాథులు.. అదే జోష్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు