పరుష పదజాలం వాడొద్దు, మర్యాదపూర్వకంగా ఉండాలి- ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు

మనపై ప్రజలు ఎన్నో ఆశలతో... ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజారిటీలతో, 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించి శాసన సభకు పంపించారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టండి.

Pawan Kalyan : పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతుల్లో కీలక సూచనలు చేశారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సభలో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలాంటి రిలేషన్ ఉండాలి, భాష ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు పవన్ కల్యాణ్. శాసనసభలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దామని పవన్ పిలుపునిచ్చారు. సభ నియమావళిపై అవగాహన పెంచుకోవాలని, సభ సంప్రదాయాలు గౌరవించాలని సూచించారాయన.

శాఖాపరమైన అంశాలను, ప్రజా సమస్యలను అధ్యయనం చేసి చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని తన పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఉక్కుపాదం మోపుదాం. పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గాల పర్యటనకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు పవన్.

‘మనపై ప్రజలు ఎన్నో ఆశలతో… ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజారిటీలతో, 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించి శాసన సభకు పంపించారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టండి. మర్యాదపూర్వకమైన భాష వాడాలి. విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండవచ్చు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా, గౌరవంగా ఉండాలి. ప్రజలు, అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు, చర్చల్లో పరుష పదజాలం వాడొద్దు.

నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టండి. మన పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు నియోజకవర్గస్థాయిలో అభినందన కార్యక్రమాలు చేపట్టండి. మీ గెలుపు కోసం తోడ్పడిన కూటమి నాయకులను, మన పార్టీ నాయకులను అభినందించండి. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో నిస్వార్థంగా పని చేసిన జనసైనికులు, వీర మహిళలను, సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పని చేసిన వారిని గుర్తించండి.

మన పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత మీపై ఉంది. ఇటువంటి అవగాహన చర్చలు ప్రతి నెల నిర్వహించుకుందాము” అని ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో పవన్ అన్నారు.

Also Read : అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు

ట్రెండింగ్ వార్తలు