అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు

వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇంత క్లియర్‌కట్‌గా కనిపిస్తున్నా... ఇంకా తాము ఓడిపోయామని అంగీకరించలేని చాలా మంది వైసీపీ లీడర్లు భ్రమల్లో బతకడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడంపై మరింత రగిలిపోతున్నారట కార్యకర్తలు.

అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు

Ysrcp Defeat : 40 శాతం ఓట్లు వస్తే… గెలిచింది 11 సీట్లేనా? అదే 40 శాతం ఓట్లతో పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. 40 శాతం కన్నా తక్కువ ఓట్లతో మూడు సార్లు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చారు. మరి మాకేంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు… అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులకు…. ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోంది. ఇన్నాళ్లు ఆత్మస్థుతి.. పరనిందకు ప్రాధాన్యమిచ్చిన వారు… అసలు లోపమేంటో మేం చెబుతాం వింటారా? అంటూ మాజీ ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్తల వరకు వైసీపీ తప్పుల చిట్టా విప్పుతున్నారట.. ఆ తప్పులేంటో… వైసీపీ లెక్కలేంటో ఇప్పుడు చూసేయండి…

తప్పుల గుట్టు విప్పుతున్న నేతలు..
67 స్థానాల‌తో ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ… 151కి ఉవ్వెత్తున ఎదిగి.. 11కు ప‌డిపోయింది. ఈ ప‌రిస్థితికి కార‌ణం ఏంటి? అంటే.. గ‌త నాలుగు రోజులుగా ఆ పార్టీ నాయ‌కులే చెబుతున్నారు…. చెప్పడం కాదు తప్పుల గుట్టు విప్పుతున్నారు… ఎన్నికల ముందు వరకు వైనాట్‌ 175 అంటూ కన్న కలలు పేకమేడలా కూలిపోవడంతో జీర్ణించుకోలేని నేతలు… సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతల వరకు చెబుతున్న మాటలు విని… ఔనా అంటూ తెల్లముఖం పెడుతున్నారట.

వారి నోటి దురుసు, అతి వల్లే ఓటమి..
ఇన్నాళ్లు కార్యకర్తలను కలిసేందుకే టైమ్‌ ఇవ్వని పార్టీ అధినేత జగన్‌కు సొంత నియోజకవర్గంలోనూ సెగ తగిలింది. ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా కార్యకర్తల నుంచి మోత మోగిపోతుందట.. కొందరు నేతలు నోటి దురుసుతో అతి చేయడం వల్లే ప్రజలు అసహ్యించుకున్నారని కార్యకర్తలు చెప్పడమే కాకుండా… తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో వైసీపీ పెద్దలకు దిమ్మదిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోతుందట..

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సినిమా చూపిస్తున్న కార్యకర్తలు..
ఇంత సంక్షేమం చేసి, 2లక్షల 70 వేల కోట్ల రూపాయలు అకౌంట్లలో వేస్తే… అక్కచెల్లెమ్మలు, తల్లుల అభిమానం ఏమైపోయిందో అర్థం కావడం లేదు.. అంటూ ఈవీఎంలపై నెపంనెట్టి సానుభూతిని అకౌంట్‌లో వేసుకుందామని చూసిన మాజీ సీఎం జగన్‌తోపాటు వితండవాదం చేసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు అసలు సినిమా చూపిస్తున్నారట కార్యకర్తలు. కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తుంటే… మరికొందరు నియోజకవర్గాల్లో పరిస్థితులను.. కార్యకర్తలను ఏ రోజైనా పట్టించుకున్నారా? అంటూ నిలదీస్తున్నారట…

వ్యతిరేకంగా ఓటువేసిన ప్రభుత్వ ఉద్యోగులు..
మే 13న ఎన్నికలు జరిగితే… ఈ నెల 4న ఫలితాలు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా 81 శాతం ఓటింగ్‌ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా ఓట్లు వేశారని, ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం జరిగింది. క్షేత్రస్థాయిలో ఈ విషయం అందరికీ తెలిసినా…. ఆ నిజం తెలుసుకోడానికి…. అంగీకరించడానికి సిద్ధపడలేదట వైసీపీ అగ్ర నాయకత్వం. దీంతో ఏదో ఒకటి అవుతుందిలే… నిండా మునిగిపోయాం… ఇప్పుడు చేసేదేం లేదని చాలామంది సీనియర్‌ లీడర్లు ఎన్నికల్లో సైలెంట్‌ అయిపోయారట…

నిండా ముంచేసిన నోటి దురుసు, నాసిరకం మద్యం, ఇసుక విధానం..
కొంతమంది డబ్బు కూడా పెద్దగా ఖర్చు చేయలేదని తాజాగా బయటకు వస్తోంది. అధిష్టానం డబ్బు సాయం చేస్తుందని ఎదురుచూసిన మరికొందరు… అటు నుంచి ఎలాంటి సాయం అందక చివరికి చేతులెత్తేశారని అంటున్నారు. ఇక విపక్షాలపై నోటి దురుసు… నాసిరకం మద్యం, ఇసుక విధానంతో వైసీపీ నిండా మునిగిపోయిందనే విశ్లేషణలు తొలిరోజు నుంచే వినిపిస్తున్నాయి.

వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇంత క్లియర్‌కట్‌గా కనిపిస్తున్నా… ఇంకా తాము ఓడిపోయామని అంగీకరించలేని చాలా మంది వైసీపీ లీడర్లు భ్రమల్లో బతకడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడంపై మరింత రగిలిపోతున్నారట కార్యకర్తలు…. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి వంటివారు పార్టీ ఓటమికి చెబుతున్న కారణాలు… పార్టీలో అంతా అంగీకరిస్తున్నారు. కానీ, అధికారంలో ఉండగా, ఎవరూ చెప్పలేని పరిస్థితి కల్పించడమే వైసీపీకి మరణశాసనం లిఖించిదన్న అసలు నిజమే ఇంకా తెలుసుకోలేకపోతున్నారు.

Also Read : బొత్స కుటుంబం ఇక ఇంటికే పరిమితమా? ఘోర ఓటమికి ప్రధాన కారణం అదేనా?