Social media ban in AP : కర్ణాటక బాటలో ఏపీ.. చిన్నపిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Social Media Ban : 13ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధిం విధించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి విధివిధానాలు తయారవుతున్నాయని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలిపారు.
cm chandrababu Naidu
- చిన్న పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై ఏపీ ప్రభుత్వం దృష్టి
- 13ఏళ్లలోపు వారికి బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చింది
- అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
- 90రోజుల్లో శ్రీకారం చుడతాం
- అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు
Social Media Ban : సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్ధాలూ పొంచి ఉన్నాయి. ముఖ్యంగా 16ఏళ్లలోపు చిన్నారుల్లో సోషల్ మీడియా ప్రభావంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలోని పలు ప్లాట్ ఫారమ్‌లలో అసభ్యకరమైన కంటెంట్, భయానకమైన వీడియోలు చిన్నారుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని, తద్వారా చదువుపై దృష్టిసారించలేక పోతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
గతేడాది ఆస్ట్రేలియాలో 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా.. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంసైతం 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం సోషల్ మీడియా బ్యాన్పై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 13ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధిం విధించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి విధివిధానాలు తయారవుతున్నాయని అన్నారు. 90రోజుల్లో విధివిధానాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని, వాళ్ల చదువుతోపాటు పాటు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, 13-16ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్నదానిపై అందరితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇందుకోసం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి.. నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఏ వయస్సు వరకు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలనే అంశంపై చర్చించిన తరువాత స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతాయని చంద్రబాబు అన్నారు.
ఆస్ట్రేలియా గత ఏడాది డిసెంబర్ నెలలో 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ చర్యలు చేపట్టాయి. మరికొన్ని దేశాలు చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నాయి.
భారతదేశం విషయానికి వస్తే.. చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించేలా పలు రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. రాష్ట్రంలో 16ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. తద్వారా భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.
