Bhalachandra Sankashti Chaturthi 2026: నేడే బాలచంద్ర సంకష్టహర చతుర్థి.. ఈ సమయంలో ముడుపు కడితే.. అద్భుతమైన ఫలితాలు
Bhalachandra Sankashti Chaturthi 2026: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే బాలచంద్ర సంకష్టహర చతుర్థి నేడు. మరి ఈ పండగ ప్రాముఖ్యత ఏంటి.. పూజా విధానం, సమయం, ప్రత్యేక నియమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Bhalachandra Sankashti Chaturthi 2026 date puja timings significance full details
Bhalachandra Sankashti Chaturthi 2026: హిందువులకు ప్రతి నెలా ముఖ్యమైన పర్వదినాలు వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో సంకష్టహర చతుర్థి ఒకటి. మార్చి 6, శుక్రవారం నాడు బాలచంద్ర సంకష్టహర చతుర్థి పర్వదినం జరుపుకుంటున్నారు. గణాలకు అధిపతి అయిన వినాయకుడికి అంకితం చేసిన ఈ పవిత్ర పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి, విఘ్ననాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించి, అభివృద్ధి సాధించడానికి గణనాథుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. కోర్కెలు తీర్చమంటూ గణపతికి ప్రత్యేకంగా ముడుపు కడతారు.
చంద్రోదయం తర్వాత సాయంత్రం పూజ ముగిసిన అనంతరం ఉపవాసం విరమిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం చూసుకుంటే ప్రతి చంద్రమాసంలో రెండు చతుర్థి తిథులు ఉంటాయి. పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్షంలో సంకష్టహర చతుర్థి తిథి, అమావాస్య తర్వాత శుక్ల పక్షంలో వినాయక చతుర్థి తిథులు వస్తాయి. అయితే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని మాత్రం బాలచంద్ర సంకష్టహర చతుర్థిగా జరుపుకొంటారు. ఈ పర్వదినాన భక్తులు చంద్రవంకను నుదుట ధరించిన బాలచంద్ర గణపతిని ఆరాధించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
బాలచంద్ర సంకష్టి చతుర్థి 2026కు సంబంధించిన తిథి మార్చి 6 సాయంత్రం 5:53 నిమిషాలకు ప్రారంభమై, 7వ తేదీ సాయంత్రం 7:17 నిమిషాలకు ముగుస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున రాత్రి 9:14 గంటలకు చంద్రోదయం ఉంటుంది. నేడు ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు చంద్ర దర్శనం, చంద్రుడికి పూజలు నిర్వహించిన తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు. భక్తులు ఈ వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. ఈ పర్వదినం నాడు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని, సూర్యోదయం తర్వాత నుంచి ఉపవాసం ప్రారంభించాలి. వినాయకుడిని మనసులో ధ్యానిస్తూ వ్రతం పాటించడానికి సంకల్పం తీసుకోవాలి. చాలామంది నేడు మౌన దీక్ష పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు.
ముడుపు కట్టే సమయం..
ఈ పర్వదినంలో అత్యంత విశేషమైనది ముడుపు కట్టడం. బాలచంద్ర సంకష్టహర చతుర్థి నాడు తెల్లవారుజామున 4:03 నిమిషాల నుంచి ఉదయం 8:32 నిమిషాల మధ్య లేదా ఉదయం 9:21 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:32 నిమిషాల మధ్య ముడుపు కట్టాలి.
ముడుపు కట్టడం కోసం పవిత్రమైన తెల్లటి లేదా ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. దానిలో ఒక తమలపాకు, రెండు ఎండు ఖర్జూరాలు, రెండు పోకలు, ఒక రూపాయి నాణెం, మూడు గుప్పిళ్ల నల్ల నువ్వులు లేదా బియ్యం ఉంచాలి. మనసులో ఉన్న కోరికను తలచుకుని ఆ ముడుపును కట్టి, గణపతి విగ్రహం లేదా పటం ముందు పెట్టి రోజంతా పూజ చేయాలి. వ్రతం ముగిసిన తర్వాత ఆ ముడుపును దేవుని ముందు నుంచి తీసి, ఏదైనా పారే నదిలో లేదా శుభ్రమైన నీటిలో వదిలివేయాలి.
బాలచంద్ర సంకష్టహర చతుర్థి కావున సాయంత్రం మరోసారి స్నానం చేసి చంద్రుడికి ప్రత్యేక పూజ చేయాలి. పీఠంపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి షోడశోపచార పూజతో ఆరాధించాలి. గణపతికి ఇష్టమైన మోదకాలు, గరిక, తమలపాకులు, ఎర్రటి పూలు సమర్పించాలి. చంద్రోదయం సమయంలో నీరు, పువ్వులు, ప్రార్థనలతో అర్ఘ్యం సమర్పించిన తర్వాతే ఉపవాసం విరమించాలి. నేడు కేవలం సాత్వికాహారం తీసుకోవాలి. కఠిన ఉపవాసం ఉండలేని వారు పండ్లు, ఇతర తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. వినాయకుడిని.. విఘ్నాలు తొలగించే దైవంగా, జ్ఞాన విజయాలను ప్రసాదించే దైవంగా కొలుస్తారు కాబట్టి, ఈ వ్రతం ఆచరించడం వల్ల జీవితంలో కష్టాలు తొలగి.. సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం.
