Toli Ekadashi 2026 : తొలి ఏకాదశి ఎందుకు అత్యంత పవిత్రం? అంబరీషుడు, మాంధాత కథలు చెప్పే సందేశం ఇదే.. ఆధ్యాత్మిక రహస్యం
Toli Ekadashi 2026 : భవిష్య పురాణం ప్రకారం.. చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.
Toli Ekadashi 2026
Toli Ekadashi 2026 : భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి. అనగా తొలి ఏకాదశి. దీనిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణించబడుతుంది. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, ఈరోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
Also Read : Toli Ekadashi 2026 : తొలి ఏకాదశి రోజున ఈ పనులు అస్సుల చేయొద్దు.. కారణాలివే? ఒకవేళ అలా చేశారంటే..
ఈసారి తొలి ఏకాదశి 25వ తేదీ శనివారం జరుపుకుంటారు. వాస్తవానికి తొలి ఏకాదశి ఘడియలు శుక్రవారం ఉదయం 10గంటల తరువాత ప్రారంభం అవుతాయి. అయితే, సూర్యోదయం వేళ ఏ తిథి ఉంటే దానిని పరిగణలోకి తీసుకుంటారు. దీంతో తొలి ఏకాదశి శనివారంగా పరిగణిస్తారు.
భవిష్య పురాణం ప్రకారం.. చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.
తొలి ఏకాదశి మనకు కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అహంకారం, కోపం, లోభం, అసూయ వంటి అంతరంగ దోషాలను తగ్గించుకోవాలని బోధిస్తుంది. భగవంతునికి దగ్గర కావడానికి ముందు మన మనస్సును పవిత్రం చేసుకోవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది.
తొలి ఏకాదశి అనేది ఒక పండుగ మాత్రమే కాదు.. అది భక్తి, నియమం, ఆత్మపరిశీలన, ధర్మాచరణ మరియు ప్రకృతితో సమన్వయ జీవన విధానానికి శ్రీకారం చుట్టే మహోన్నత దినం. పద్మ పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం వంటి శాస్త్రాలు దీనిని అత్యున్నత వ్రతాలలో ఒకటిగా కొనియాడాయి.
శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని కోరుతూ, చాతుర్మాస్య సాధనకు సంకల్పించి, ఉపవాసం, జపం, ధ్యానం, దానం, సత్సంగం ద్వారా మన జీవితాన్ని పవిత్రం చేసుకోవడమే తొలి ఏకాదశి యొక్క నిజమైన సందేశం.
తొలి ఏకాదశి ఆచరించి తరించిన మహనీయులు..
రాజా మాంధాత : రాజా మాంధాత ధర్మపరుడు. ఒకసారి ఆయన రాజ్యంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. ప్రజలు ఆకలి, దాహంతో బాధపడుతున్నారు. అప్పుడు మహర్షులు “ఆషాఢ శుక్ల ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించండి.” అని రాజుకు ఉపదేశించారు. దీంతో రాజు ప్రజలతో కలిసి ఉపవాసం చేసి శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కరువు తొలగిపోయింది. రాజ్యంలో సుభిక్షం నెలకొంది. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించారు. దీనిద్వారా ఏకాదశి వ్రతం వ్యక్తిగత శ్రేయస్సుకే కాదు, సమాజ హితానికీ సంకేతమని పద్మ పురాణం తెలియజేస్తుంది.
మహారాజు అంబరీషుడు : అంబరీష మహారాజు అన్ని ఏకాదశులను అత్యంత నియమంతో ఆచరించేవాడు. ఒకసారి ద్వాదశి పారణ సమయంలో దుర్వాస మహర్షి ఆలస్యంగా రావడంతో ధర్మసంకటంలో పడ్డాడు. శాస్త్రవిధిని కాపాడేందుకు కేవలం తులసీజలాన్ని మాత్రమే స్వీకరించాడు. దుర్వాసుడు కోపించినప్పటికీ, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం అంబరీషుని రక్షించింది. ఏకాదశి వ్రతంలో నియమపాలన, వినయం, భక్తి ఎంత ముఖ్యమో అంబరీషుని చరిత్ర తెలియజేస్తుంది. అదేవిధంగా రుక్మాంగదుడు తన రాజ్యంలో అందరూ ఏకాదశి వ్రతం ఆచరించేలా చేసి చివరికి విష్ణులోక ప్రాప్తి పొందినట్లు పురాణాలు వివరిస్తాయి.
భీష్ముడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమను వివరిస్తూ, ఉపవాసం, దానం, విష్ణు భక్తి యొక్క ప్రాముఖ్యతను బోధించాడు. అతని ఉపదేశాలే తరువాత అనేక ధర్మగ్రంథాలకు ఆధారమయ్యాయి. భక్తి, నియమం, విష్ణు స్మరణ, దానం, ధర్మాచరణతో తొలి ఏకాదశిని ఆచరించినవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు బోధిస్తున్నాయి.
