Raksha Bandhan : సోదరులకు రాఖీ కట్టే విధానం ఇదే.. అన్నకు ముందు కట్టాలా? తమ్ముడికా? సంప్రదాయం ఏం చెబుతోంది?
Raksha Bandhan : సంప్రదాయం ప్రకారం.. ఒక సోదరికి అన్న, తమ్ముడు ఇద్దరూ ఉంటే.. ఇద్దరు కంటే ఎక్కువ మంది సోదరులు ఉంటే.. ముందుగా ఎవరికి రాఖీ కట్టాలని పలువురు సందేహ పడుతుంటారు.
Raksha Bandhan
Raksha Bandhan : అక్కాచెల్లెళ్లు అన్నాదమ్ముళ్ల అనుబంధానికి నిష్కల్మశమైన ప్రేమకు ప్రతీక రక్షాబంధన్. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట్లో అపరిమితమైన ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్నతనం నుంచి కలిసి పెరిగిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకునే అమూల్యమైన పండుగ రక్షాబంధన్.
Also Read : Raksha Bandhan 2026 : రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదే.. ఈ సమయాల్లో అస్సలు కట్టొద్దు
రాఖీ ఎలా కట్టాలి..?
ఒక పల్లెంలో దీపం, అక్షింతలు, కుంకుమ, తీపి పదార్థాలు, రాఖీ ఉంచాలి. అన్న లేదా తమ్ముడు తూర్పు లేదా ఉత్తర దిక్కునకు ముఖం ఉండేలా కూర్చోవాలి. చెల్లెలు లేదా అక్క పడమర లేదా దక్షిణ దిక్కున నిలబడి లేదంటే కూర్చొని రాఖీ కట్టాలి. ముందుగా సోదరుడి నుదుటన కుంకుమ తిలకం దిద్ది కొన్ని అక్షింతలు చల్లాలి. తర్వాత కుడి చేతి మణికట్టుపై మంత్రోచ్చారణ చేస్తూ లేదంటే మనస్ఫూర్తిగా ఆయురారోగ్యాలు కోరుకుంటూ రాఖి కట్టాలి. కట్టిన తర్వాత సోదరుడికి తీపి పదార్థం తినిపించాలి. సోదరుడు తన శక్తి కొద్ది కానుకలు ఇచ్చి అక్కా చెల్లెలు రక్షణకు హామీ ఇస్తూ ఆశీర్వచనం అందిస్తారు
ముందుగా ఎవరికి రాఖీ కట్టాలి?
సంప్రదాయం ప్రకారం.. ఒక సోదరికి అన్న, తమ్ముడు ఇద్దరూ ఉంటే.. ఇద్దరు కంటే ఎక్కువ మంది సోదరులు ఉంటే.. ముందుగా ఎవరికి రాఖీ కట్టాలని పలువురు సందేహ పడుతుంటారు. అయితే, అన్నయ్యకు ముందుగా రాఖీ కట్టి.. తరువాత తమ్ముళ్లకు రాఖీ కట్టవచ్చు. కుటుంబంలో పెద్దలకు మొదటి గౌరవం ఇవ్వాలనే సంప్రదాయ భావనతో ఈ క్రమాన్ని పాటిస్తారు.
రాఖీ సోదరులకు మాత్రమే కట్టాలా?
రాఖీ పండగ అనగానే మనకు కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు పండుగ అనే గుర్తొస్తుంది. కానీ, రాఖీ అనే భావన కేవలం రక్త సంబంధానికి లేదా సోదరులకు మాత్రమే పరిమితం కాదు. రక్షాబంధన్ అంటే రక్షణ ఇచ్చే బంధం. మనల్ని ఏ రూపంలోనైనా కాపాడే వారికి మన శ్రేయస్సు కోరే వారికి రాఖీ కట్టవచ్చు. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, రాజులకు కుల గురువులు విపత్తుల నుంచి రక్షణ కలగాలని రక్షా సూత్రాన్ని కట్టేవారు. చాలామంది తమ తొలి రాఖీని ఇష్ట దైవమైన శ్రీకృష్ణుడు, విఘ్నేశ్వరుడు లేదా శివుడికి సమర్పిస్తారు. భగవంతుడే తమకు పరమ రక్షకుడని నమ్మి ఈ ఆచారం పాటిస్తారు.
