Telangana Politics : ఎర్రవల్లి భూముల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్ ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చే చాన్స్ ఉందా?
Telangana Politics : అటు ఎర్రవల్లి ఎపిసోడ్.. ఇటు మెడికవర్ ముందు ఫ్లెక్సీలు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా ఇప్పుడు భూములు, ఆస్తులు, కంపెనీలు, బిజినెస్ లింకుల చుట్టూ తిరుగుతోంది.
Erravalli Land Episode
Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో ఎర్రవల్లి ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. అక్కడ భూముల అంశంపై సెప్టెంబర్ 16న అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ విచారణకు ఆదేశించిన తర్వాత.. అధికారులు సర్వే చేపట్టారు. సెప్టెంబర్ 17న అధికారులు మొదటి దశ సర్వే నిర్వహించారు. అందులో సర్వే నంబర్ 325కు సంబంధించిన భూముల హద్దులను పరిశీలించారు. ఐతే రికార్డుల్లో ఉన్న 388 ఎకరాలకు బదులుగా 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు.. సీఎం నిర్వహించిన సమీక్షలో అధికారులు వివరించారు. దీంతో 45 ఎకరాల లెక్క ఎక్కడ తేడా పడిందన్నది అతిపెద్ద ప్రశ్నగా మారింది.
అయితే, రెండో దశ సర్వే తర్వాత..ఈ కథలో అసలు ట్విస్ట్ కనిపించే చాన్స్ ఉంది. 45 ఎకరాల ఆచూకీ తేల్చేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం పరిధిలో మరోసారి సర్వే నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం.. రికార్డుల్లో ఉన్న భూమి ఎక్కడుంది.. ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటి.. హద్దులు ఎలా ఉన్నాయ్.. యాజమాన్య వివరాలు ఏంటనేది తేల్చే ప్రక్రియ ఇకపై మొదలుకానుంది. మరి ఈ సర్వేలో ఫాంహౌస్ పరిధి కూడా కీలకంగా మారుతుందా అనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో 45ఎకరాల భూమి ఆచూకీ లభించడం లేదు. రికార్డులకు, వాస్తవానికి మధ్య ఈ వ్యత్యాసం ఉంది. దీనిపై విచారణ జరుగుతోంది. ఆ భూముల గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. మరి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఫ్యామిలీకి నోటీసుల చర్చ తెరమీదకు వచ్చింది. సర్వే నంబర్ 325కు ఆనుకుని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్నాయ్. దీంతో ఆయా భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు సమర్పించాలని వారికి నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
అయితే, ఈ భూముల విషయంలో కేవలం సర్వేతోనే రేవంత్ సర్కార్ ఆగడం లేదు. సర్వే నంబర్ 325లో గుర్తించే ప్రభుత్వ భూమిని అర్హులైన స్థానిక రైతులకు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. అదే భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక అమరవీరుల కాలనీ నిర్మించాలని నిర్ణయించారు. అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలాలు, మౌలిక వసతులు కల్పించి.. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అంటే.. 45 ఎకరాల లెక్క తేలడం ఒక ఎత్తయితే.. ఆ భూమి భవిష్యత్తులో ఎవరికి వెళ్తుందన్నది మరో కీలక అంశంగా మారుతోంది.
ఎర్రవల్లి భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెంచిన వేళ.. అటు బీఆర్ఎస్ కూడా రివర్స్ గేమ్ స్టార్ట్ చేసింది. సీఎం రేవంత్ కుటుంబ ఆస్తులు, వ్యాపార వ్యవహారాలపై ప్రశ్నలు కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. మెడికవర్ సహా పలు సంస్థలు, వ్యాపార లావాదేవీలను ప్రస్తావిస్తూ సీఎం కుటుంబంపై కారు పార్టీ నేత క్రిశాంక్ కీలక ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ బయట 13వేల 200 కోట్ల పేరుతో ఫ్లెక్సీలు ప్రత్యక్షం కావడం.. ఆ తర్వాత క్రిశాంక్ అరెస్ట్‌తో ఒక్కసారిగా రాజకీయ మంటలు కనిపించాయ్. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కూడా ముందుకు తీసుకెళ్తోంది. దీంతో పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయ్.
అటు ఎర్రవల్లి ఎపిసోడ్.. ఇటు మెడికవర్ ముందు ఫ్లెక్సీలు. దీంతో రాజకీయం అంతా ఇప్పుడు భూములు, ఆస్తులు, కంపెనీలు, బిజినెస్ లింకుల చుట్టూ తిరుగుతోంది. ఎర్రవల్లి భూముల రికార్డులు తేల్చాలని రేవంత్ సర్కార్ అంటుంటే.. రేవంత్ కుటుంబ ఆస్తులు, వ్యాపారాలపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
ఇక అటు బీఆర్ఎస్కు.. ఎర్రవల్లి ఎపిసోడ్ కీలకమైన రాజకీయ పరీక్షగానే మారింది. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు వస్తే.. కారు పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వీటన్నింటికి మించి ఈ వ్యవహారంపై ఇప్పటివరకు రియాక్ట్ కాని కేసీఆర్.. నోటీసులు వచ్చిన తర్వాత స్వయంగా రంగంలోకి దిగుతారా.., తమ భూములకు సంబంధించిన రికార్డులను జనాల ముందు పెడతారా.. లేదంటే పార్టీ నేతలతోనే కౌంటర్ ఇప్పిస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇక అటు రేవంత్ సర్కార్‌కు కూడా ఈ ఎపిసోడ్ అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. సర్కార్ చెప్పిన 45ఎకరాల తేడాకు పూర్తి ఆధారాలు చూపించడం.. సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం.. ఎవరి భూమి ఎక్కడుందనేది అధికారిక రికార్డులతో స్పష్టం చేయడం సర్కార్‌కు కీలకం కానుంది.
అమరవీరుల కాలనీ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలంటే.. భూముల హక్కులు, హద్దులు, రికార్డులన్నీ క్లియర్‌గా ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు రాజకీయ ఆరోపణల కంటే సర్వే రిపోర్ట్, రెవెన్యూ రికార్డులే కీలకంగా మారబోతున్నాయ్. ఓవరాల్‌గా తెలంగాణ రాజకీయాల్లో అసెట్స్ వార్ మరో స్టేజ్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారాలకు కేంద్ర బిందువులుగా మారిన రేవంత్, కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు ఆస్థుల అంశంలో నోరువిప్పకపోవడం విశేషం.
