Imran Khan Health : పాక్ జైలులో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి విషమం..? న్యాయమూర్తులకు అత్యవసర లేఖ
Imran Khan Health condition
Imran Khan Health : పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిక్ -ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. రావల్పిండిలోని అడియాలా జైలులో కొన్నేళ్లుగా ఉంటుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్ న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులకు ఇమ్రాన్ ఖాన్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు సరైన వైద్య చికిత్స అందడం లేదని, ఎప్పుడైనా గుండెపోటు లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఇమ్రాన్ ఖాన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే తాను ప్రాణాలతో బయటకు వస్తాననే నమ్మకం లేదని పేర్కొన్నారు. తన కుడి కంటిలో 85శాతం చూపు కోల్పోయినట్లు లేఖలో పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఏకాంత నిర్బంధంలో ఉంచడం, సరైన వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తోందని ఆరోపించారు. రోజులో సుమారు 22 గంటల పాటు ఒంటరిగా ఉంచుతున్నారని తెలిపారు.
నవంబర్ 10న తన రక్తపోటు 192-193 స్థాయికి చేరిందని, దీంతో గుండెపోటు లేదంటే మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు వెల్లడించారు. తనకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని న్యాయమూర్తులను కోరారు. తన భార్య బుష్రా బీబీ ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆమెకు గతంలో కంటి సమస్యలు రావడంతో శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం చూపు మరింత దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఆమెకు కూడా మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.
2022లో ప్రధానమంత్రి పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. అవినీతి సహా పలు కేసులను ఎదుర్కొంటున్నారు. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిపై న్యాయస్థానాలు తక్షణమే స్పందించాలని కోరుతూ లేఖ రాశారు.
