ప్రధానమంత్రివా?…ప్రజా వంచకుడివా?
పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వినూత్న గెటప్ లతో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి కొత్త గెటప్ తో ఆందోళనకు దిగారు. మెజీషియన్, కరుణానిధి, వంగపండు గెటప్ లు వేసిన శివప్రసాద్.. ఇవాళ వీరపాండ్య కట్ట బ్రహ్మణ వేషంతో నిరసనకు దిగారు. ప్రధాని మోడీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ’మిస్టర్ ప్రధాని.. నీవు ప్రధానమంత్రివా?…ప్రజా వంచకుడివా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటనే నిలబట్టకోలేని దౌర్భాగ్యుడవని అని సీరియస్ అయ్యారు. ’స్నేహం విలువ తెలియదు.. ఆపన్నహస్తం అందించిన చంద్రబాబును ప్రత్యేకహోదా అని, ప్యాకేజీ అని మోసం చేసిన ఘనుడు మోడీ’ అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.