34 వాహనాల్లో “మానవ బాంబులు” ఉన్నాయని, కోటి మందిని చంపేస్తామని చెప్పింది ఇతడే..
ఆ మెసేజ్‌లో 14 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించి, 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్ పెట్టారని ప్రధాన నిందితుడు పేర్కొన్నాడు.

Mumbai
Mumbai: ముంబైలో 34 వాహనాల్లో “మానవ బాంబులు” అమర్చామని, కోటి మందిని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు వచ్చిన మెసేజ్ కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఆ మెసేజ్ పంపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడికి 50 ఏళ్లు ఉంటాయని, అతడిని నోయిడాలో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. మరొకరిని కూడా అరెస్ట్ చేశామని, అతను తన సిమ్ కార్డ్‌ను నిందితుడికి ఇచ్చాడని వివరించారు.
ఆ మెసేజ్‌లో 14 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించి, 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్ పెట్టారని ప్రధాన నిందితుడు పేర్కొన్నాడు. అనంత చతుర్దశి సందర్భంగా గణేశ్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఈ మెసేజ్ రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
మెసేజ్ పంపిన వ్యక్తి పాట్నా నివాసి అశ్వినికుమార్ సురేశ్‌కుమార్ సుప్రాగా పోలీసులు గుర్తించారు. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. స్థానిక ఇంటెలిజెన్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నోయిడా సెక్టార్ 79లోని కిరాణా దుకాణం దగ్గర అతడిని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు.
అశ్వినికుమార్ జ్యోతిష్కుడు, వ్యాపారి. తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. మరొక నిందితుడు సోరకా గ్రామంలో అరెస్ట్ అయ్యాడు.
అశ్వినికుమార్ బెదిరింపు మెసేజ్ పంపడంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు కూడా పోలీసులు నిన్న సమాచారం ఇచ్చారు. మరోవైపు, గణేశ్ విగ్రహాల నిమజ్జన సమయంలో శాంతిభద్రతల కోసం 21,000 మందికిపైగా పోలీసులు నగరంలో మోహరించారు. (Mumbai)