విద్యార్థిని 60 సార్లు చెంపదెబ్బలు కొట్టారు.. వైరల్ వీడియోలో షాకింగ్ దృశ్యాలు.. సర్జరీ అయ్యిందని చెప్పినా వినలేదు..

ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన శిఖర్ కాలేజీకి వెళ్లడం మానేశాడు.

విద్యార్థిని 60 సార్లు చెంపదెబ్బలు కొట్టారు.. వైరల్ వీడియోలో షాకింగ్ దృశ్యాలు.. సర్జరీ అయ్యిందని చెప్పినా వినలేదు..

Updated On : September 6, 2025 / 8:09 PM IST

Law Student Slapping Case: దేశంలో ప్రతిష్ఠాత్మకమైన అమిటీ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. లక్నో క్యాంపస్‌లో ఒక లా విద్యార్థిపై తోటి విద్యార్థులే కిరాతకంగా దాడి చేశారు.

కారులోనే అతడిని బంధించి అమ్మాయి, అబ్బాయి కలిసి 50 నుంచి 60 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఈ దారుణాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. బాధితుడికి ఇటీవలే సర్జరీ జరిగిందని వేడుకున్నా కనికరించలేదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం…

అసలేం జరిగింది?

లక్నో అమిటీ యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న శిఖర్ కేసర్వాని అనే విద్యార్థిపై ఈ దాడి జరిగింది. ఆగస్టు 26న, అతను తన స్నేహితురాలి కారులో క్లాసులకు హాజరయ్యేందుకు క్యాంపస్‌కు వచ్చాడు.

పార్కింగ్ లాట్‌లో కారు ఆపగానే, మరో ఐదుగురు క్లాస్‌మేట్స్ ఆయుశ్ యాదవ్, జాహ్నవి మిశ్రా, మిలయ్ బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమాన్ శుక్లా అక్కడికి చేరుకున్నారు.

శిఖర్‌ను, అతని స్నేహితురాలిని కారులోనే బంధించారు. సుమారు 45 నిమిషాల పాటు శిఖర్‌ను బెదిరించి, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు.

Also Read: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు..

సర్జరీ అయ్యిందని చెప్పినా..

ఈ దాడి తన కుమారుడిని మానసికంగా కుంగదీసిందని బాధితుడి తండ్రి ముకేశ్ కేసర్వాని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. “నా కుమారుడికి ఆగస్టు 11న లిగమెంట్ సర్జరీ జరిగింది. అతను కర్ర సాయంతో నడుస్తున్నాడు.

అలాంటి వాడిని జాహ్నవి మిశ్రా, ఆయుశ్ యాదవ్ కలిసి 50-60 సార్లు కొట్టారు… చంపేస్తామని బెదిరించారు. మిగిలిన వాళ్లు ఈ దాడిని వీడియో తీసి క్యాంపస్‌లో వైరల్ చేశారు. నా కొడుకు ఫోన్‌ను కూడా పగలగొట్టారు” అని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వైరల్ వీడియోలో షాకింగ్ దృశ్యాలు..

దాడికి సంబంధించిన 101 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో.. శిఖర్ ఎడమ చెంపపై జాహ్నవి అనే విద్యార్థిని పదేపదే కొడుతూ “హాత్ నీచే” (చెయ్యి కిందకు పెట్టు) అని అరుస్తూ కనిపించింది.

ఆయుశ్ అనే మరో విద్యార్థి, “క్యారెక్టర్? క్యారెక్టర్? నువ్వు జాహ్నవి, సౌమ్య గురించి మాట్లాడతావా?” అంటూ శిఖర్‌ను బూతులు తిడుతూ, చెంపదెబ్బలు కొట్టాడు.

శిఖర్ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి, నిందితులు అతని చేతులను పక్కకు నెట్టి దాడిని కొనసాగించారు.

వీడియో తీస్తున్న వ్యక్తి “అతను క్షమాపణ చెప్పాడు, వదిలెయ్” అని చెప్పినా ఆయుశ్ వినిపించుకోకుండా దాడిని కొనసాగించాడు.

కేసు నమోదు.. భయంతో కాలేజీకి దూరం

ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన శిఖర్ కాలేజీకి వెళ్లడం మానేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై అమిటీ యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.