Cable Wire Snapped: ఘోర ప్రమాదం.. రోప్ వే కేబుల్ తెగి ఆరుగురు దుర్మరణం.. భక్తులకు తప్పిన పెను ముప్పు..!

రోప్ వే కేబుల్ ఎలా తెగిపోయింది? ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అధికారులు ఏం చెబుతున్నారు..

Cable Wire Snapped: ఘోర ప్రమాదం.. రోప్ వే కేబుల్ తెగి ఆరుగురు దుర్మరణం.. భక్తులకు తప్పిన పెను ముప్పు..!

Updated On : September 6, 2025 / 8:10 PM IST

Cable Wire Snapped: గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కొండపై ఉన్న ఆలయం వద్ద కార్గో రోప్‌ వే కేబుల్ తెగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయారు. పంచమహల్ జిల్లా పావ్ గడ్ కొండ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లు, ఇద్దరు కార్మికులు కూడా ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

భక్తులు చేరుకోవాలంటే 2వేల మెట్లు ఎక్కాలి..

శనివారం శక్తిపీఠమైన పావ్ గడ్ కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లడానికి ఉపయోగించే కార్గో ట్రాలీ కేబుల్స్‌ తెగిపోయి ట్రాలీ కిందపడింది. కాళీదేవి ఆలయం సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. యాత్రికులు, భక్తులు అక్కడికి చేరుకోవాలంటే 2వేల మెట్లు ఎక్కాలి. లేదా కేబుల్ కార్లను వాడాలి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ప్రజలు ఉపయోగించే రోప్‌వేను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఒకవేళ రోప్ వే రూట్ వాడకంలో ఉండి ఉంటే.. భక్తులు ప్రమాదంలో చిక్కుకునే వారని, మృతుల సంఖ్య ఎక్కువగా ఉండేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాఫ్తునకు ఆదేశించారు. రోప్ వే కేబుల్ తెగిపోవడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

ఈ దుర్ఘటనపై పంచమహల్ కలెక్టర్ అజయ్ దహియా మాట్లాడారు. ప్రధానంగా వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించే రోప్‌వే ప్రమాదం జరిగినప్పుడు ఆరుగురు వ్యక్తులతో కిందికి దిగుతున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిలో ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. కేబుల్ మొదటి టవర్‌కు దగ్గరగా ఉన్న కొండ దిగువన ఈ ప్రమాదం జరిగిందన్నారు. కేబుల్ ఎంత ఎత్తు నుండి పడిపోయిందో అధికారులు నిర్ధారించలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా గత రెండు రోజులుగా ప్రజల ఉపయోగం కోసం ప్రధాన రోప్‌వే మూసివేసి ఉంచారు.

పావ్ గడ్ కొండ చంపానేర్ నుండి మూడు దశల్లో ఉంటుంది. దాని పీఠభూమి 1,471 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండపైన కాళీ మాతకు అంకితం చేయబడిన మహాకాళికా ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 25లక్షల మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

Also Read: పితృపక్షం.. కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే..! ఇలా చేస్తే పితృశాపాలు తొలగి అదృష్టం కలుగుతుంది..!