AP Local Body Elections : లోకల్ ఫైట్‌లో కూటమి మాస్టర్ ప్లాన్! వైసీపీకి బిగ్‌షాక్ తప్పదా? గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయ్?
AP Local Body Elections : కూటమి పార్టీల్లో ఆశావహుల పోటీ ఎక్కువగా ఉన్న ఉంది. దీంతో ఓట్లు చీలిపోకుండా, అంతర్గత విభేదాలు రాకుండా స్నేహపూర్వక పోటీ అనే నినాదాన్ని కూడా అధినేతలు పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Andhra Pradesh Local Body Elections
AP Local Body Elections : సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేసిన కూటమి.. స్థానిక ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అనిపించాలని డిసైడ్ అయ్యాయ్. దీనికి కోసం కూటమి పార్టీలు పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నాయ్. ఎక్కడా ఓట్లు చీలకుండా చూడాలని.. వైసీపీకి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాయ్. దీనికి సంబంధించి కూటమి పార్టీ అధినేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ మధ్య మంగళవారం జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటే ప్రధాన అజెండాగా వీరిద్దరి నడుమ గంటకుపైగా చర్చలు సాగాయ్.
కూటమి పార్టీల్లో ఆశావహుల పోటీ ఎక్కువగా ఉన్న ఉంది. దీంతో ఓట్లు చీలిపోకుండా, అంతర్గత విభేదాలు రాకుండా స్నేహపూర్వక పోటీ అనే నినాదాన్ని కూడా అధినేతలు పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియ ఇబ్బందికరంగా మారినప్పుడు నష్టం జరగకుండా.. మాస్టర్ స్కెచ్ తెరపైకి తీసుకొస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. లోకల్ ఫైట్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఆశావహుల సంఖ్య వేలల్లో ఉంటుంది. దీంతో అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేయాలని.. కూటమి నేతలు భావిస్తున్నారు.
కూటమిలోని మూడు పార్టీల మధ్య 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సర్దుబాటుతో సంబంధం లేకుండా.. ప్రస్తుత బలాబలాల ఆధారంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో 3 పార్టీల కార్యకర్తలు, నాయకుల మనోభావాలను గౌరవిస్తూనే.. కూటమి ఐక్యతకు భంగం కలగకుండా సీట్ల సర్దుబాటుపై ముందుకెళ్దామని చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి బలమైన కేడర్, ప్రజాదరణ, గెలిచే సామర్థ్యం ఉంటే.. ఆ పార్టీకి ఆ స్థానాన్ని కేటాయించేలా ముందుకు వెళ్లాలని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కీలకంగా మారనుంది. ఎక్కడెక్కడ ఏ పార్టీ బలంగా ఉందన్న దానిపై నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయి కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక అటు జనసేన ఆశిస్తున్న స్థానాల జాబితాను.. చంద్రబాబుకు పవన్ అందించినట్లు టాక్. వీటిపై ఎన్డీఏ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి.. తుది నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు నిర్ణయించారు.
కూటమి పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. స్నేహపూర్వక పోటీకి వెళ్లే యోచనలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఇద్దరు బలమైన అభ్యర్థులు పట్టుబడితే ఒకరిని బలవంతంగా తొక్కేయకుండా.. స్నేహపూర్వక పోటీకి అనుమతించే యోచనలో కూడా అధినేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక ఎన్నికల్లో గెలిచేది ఎవరున్నా చివరకు వారు కూటమి అభ్యర్థులే ఉండాలన్న భావన వారిలో కనిపిస్తోంది. దీంతో ప్రత్యర్థి పార్టీలకు అవకాశం దక్కకుండా ప్రతి స్థానాన్ని తన ఖాతాలో ఉంచుకోవాలనే గట్టి ప్రయత్నం కూటమిలో కనిపిస్తోంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు మినహా మిగిలిన అన్ని చోట్లా సమన్వయ కమిటీల ద్వారా ఏకగ్రీవాలు, ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకు వ్యూహాలు రచిస్తున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసే ప్రత్యర్ధికి.. ఎక్కడా చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదని ఎన్డీఏ కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా వారు అంతర్గత ఒప్పందానికి కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
దసరా తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని తెలుస్తోంది. ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల కోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి.. కూటమి పార్టీల మధ్య సమాచార మార్పిడి, అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకంలాంటి అంశాలను సమన్వయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించే అవకాశం వైసీపీకి లేకుండా.. బలాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కూటమి పార్టీలు డిసైడ్ అయ్యాయ్. ఇక అటు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై.. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు–పవన్ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై తీర్పు వెలువడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు.
