బొత్స కుటుంబం ఇక ఇంటికే పరిమితమా? ఘోర ఓటమికి ప్రధాన కారణం అదేనా?

ఇప్పటికే సుమారు 65 ఏళ్ల వయసులో ఉన్న బొత్స ఐదేళ్ల తర్వాత రాజకీయం నడపడం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

బొత్స కుటుంబం ఇక ఇంటికే పరిమితమా? ఘోర ఓటమికి ప్రధాన కారణం అదేనా?

Botsa Satyanarayana Family : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి బొత్సకు ఓటర్లు ప్యాకప్ చెప్పేసినట్లేనా…? రెండున్నర దశాబ్దాల పాటు విజయనగరం జిల్లాను ఏలిన సత్తిబాబు కుటుంబాన్ని ఓటర్లు పక్కన పెట్టడానికి కారణమేంటి? ఇంటా-బయటా సత్తిబాబు కోసం ఏమనుకుంటున్నారు? గతంలో ఓసారి ఓడినా మళ్లీ గెలిచి సత్తాచాటిన సత్తిబాబు.. ఈ ఓటమితో ఇక ఇంటికే పరిమితమా? బొత్స కుటుంబంపై ఉన్న గాసిప్స్ ఏంటి?

బొత్సకు, ఆయన ఫ్యామిలీకి ఊహించని పరాభవం..
ఉత్తరాంధ్రలో కీలక నేత, మాజీ మంత్రి బొత్సకు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. రెండున్నర దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో.. మరీ ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాను కనుసైగతో శాసించిన బొత్స.. ఆయన ఫ్యామిలీకి ఝలక్ ఇచ్చారు ఓటర్లు. ఈ ఎన్నికల్లో బొత్సతోపాటు ఆయన సతీమణి ఝాన్సీలక్ష్మి, సోదరుడు అప్పలనరసయ్య, సోదరుడు వరసయ్యే నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పోటీచేశారు. ఈ నలుగురిలో ఏ ఒక్కరూ గెలవకపోవడాన్ని వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఓటమికన్నా.. విశాఖ ఎంపీగా పోటీ చేసిన బొత్స ఝాన్సీలక్ష్మి 5 లక్షల ఓట్ల తేడాతో ఎలాంటి ప్రభావం చూపలేకపోవడమే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.

విజయనగరం జిల్లాను మాత్రం టచ్ చేయని జగన్..
కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన బొత్స అంచలంచెలుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఒకానొక సమయంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీపడ్డారు. కాలం కలిసిరాక సీఎం పోస్టు దక్కకపోయినా, రాష్ట్ర విభజనకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఆ స్థాయి పవర్ చూపించారు. ఇక వైసీపీలోనూ మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి తర్వాత ఆ పార్టీలో అంతే పవర్ బొత్సకు ఉండేది. అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేసిన మాజీ సీఎం జగన్, విజయనగరం జిల్లాను మాత్రం టచ్ చేయలేదు. ఒక్క విజయనగరమే కాదు పక్కనే ఉన్న విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ బొత్స చెప్పిన వారికే టికెట్లు ఇచ్చారు. అయితే ఇదంతా ఇప్పుడు గతం. వర్తమానంలో బొత్స భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు విశ్లేషకులు.

జిల్లా రాజకీయాల్లో ఒక్కో నియోజకవర్గానికి విస్తరించిన బొత్స కుటుంబం..
1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడిన బొత్స.. 1999లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అలా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకుని 2004లో చీపురుపల్లి ఎమ్మెల్యే గెలిచి తొలిసారి మంత్రి అయ్యారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు బొత్స. తను మంత్రిగా ఉంటూనే తన భార్యను విజయనగరం జడ్పీ చైర్ పర్సన్ గా, బొబ్బిలి ఎంపీగా చేశారు. ఇక 2009లో వీరిద్దరితోపాటు బొత్స తమ్ముడు అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో బొత్స సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడికి నెల్లిమర్ల ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారు. ఇలా జిల్లా రాజకీయాల్లో ఒక్కో నియోజకవర్గానికి విస్తరించిన బొత్స కుటుంబం.. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల పోటీ చేసి… అన్నిచోట్లా ఓడిపోయింది.

బొత్స కుటుంబం ఓటమికి అంతర్గత విభేదాలే కారణం..
మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు బొత్స కుటుంబంలో ఉండేవి. కానీ, ఈ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఒక్కటే బొత్స ఫ్యామిలీకి మిగిలింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ పదవిని నిలబెట్టుకోవడం కూడా బొత్స కుటుంబానికి సవాలేనంటున్నారు పరిశీలకులు. జిల్లా రాజకీయాలను శాసించిన బొత్స కుటుంబం ఇలా ఓటమి మూటగట్టుకోడానికి అంతర్గత విభేదాలే ఎక్కువనే టాక్ వినిపిస్తోంది. బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలే బొత్స ఓటమికి కారణాలు అంటున్నారు.

ఇక నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ ఓటమి వెనుక బొత్స కుటుంబ సభ్యల పాత్ర ఉందనే ప్రచారం ఉంది. ఇక గజపతినగరంలో భూ ఆక్రమణలు శరాఘాతం కాగా, కీలకమైన విశాఖ ఎంపీ సీటులో బొత్స పరువుపోడానికి మూడు రాజధానుల అంశం ప్రధానమంటున్నారు. ఇక ఇప్పటికే సుమారు 65 ఏళ్ల వయసులో ఉన్న బొత్స ఐదేళ్ల తర్వాత రాజకీయం నడపడం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

Also Read : లక్ష్యం కీలక పదవులు, శాఖలు కాదు.. టీడీపీ ప్రభుత్వం అసలు టార్గెట్ ఇదే