T20 World Cup 2026 : వర్షం కారణంగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రద్దైతే.. భారత్, న్యూజిలాండ్ జట్లలో విజేత ఎవరంటే?
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026 ) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Who wins the title if T20 World Cup 2026 final is washed out due to rain
- ఆదివారం భారత్, న్యూజిలాండ్‌ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్
- నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా
- ఎవరు గెలిచినా చరిత్రే
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడేందుకు టీమ్ఇండియా అడుగుదూరంలో ఉంది. వరుసగా రెండో సారి భారత జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరుకుంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ కప్పు కోసం పోటీపడనుంది.
కాగా.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్, కివీస్ జట్లు తలపడడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, కివీస్ జట్లు ఇప్పటి వరకు మూడు సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్ విజయం సాధించడం గమనార్హం. భారత్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపొందలేదు.
ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలని న్యూజిలాండ్ భావిస్తోంది. మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండో సారి, స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఆరాటపడుతోంది. ఇప్పటి వరకు ఏ ఆతిథ్య దేశం కూడా టీ20 ప్రపంచకప్‌ను గెలవలేదు. టీ20 ప్రపంచకప్ 2026కు భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
వర్షం పడితే పరిస్థితి ఏంటి ?
టీ20 ప్రపంచకప్ 2026లో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం లేదు. ప్రస్తుతం భారత్‌లో ఎండాకాలం ప్రారంభమైంది. ఒకవేళ హఠాత్తుగా వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అనే విషయాలను ఓ సారి చూద్దాం.
ఫైనల్ మ్యాచ్ ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. వర్షం కారణంగా ఆదివారం మ్యాచ్ జరిగని పరిస్థితి ఉంటే.. రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహించవచ్చు. వాస్తవానికి ఓవర్లు తగ్గించి అయినా సరే ఆదివారమే మ్యాచ్‌ను పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తారు. ఇందుకోసం 120 నిమిషాల అదనపు సమయం కూడా అందుబాటులో ఉంటుంది. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను ప్రకటించాలన్నా కూడా ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆదివారం మ్యాచ్ ప్రారంభమై మధ్యలో నిలిచిపోతే.. సోమవారం రోజున మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అయితే.. ఆదివారం మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే సోమవారం మ్యాచ్ కొనసాగనుంది.
ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితులు ఉంటే అప్పుడు మ్యాచ్ ను రద్దు చేస్తారు. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
