Akkineni Nageswara Rao : వంద సంవత్సరాల అక్కినేని అందగాడు.. నేటి నుంచి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం..

వచ్చే సంవత్సరం ఆయన 100వ జయంతి కావడంతో ఈ సంవత్సరం నేడు ఆయన పుట్టిన రోజు నుంచి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Akkineni Nageswara Rao 100 Years Birthday Special Article ANR 100 Years Celebrations

Akkineni Nageswara Rao :  తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR) రెండు కళ్లలాంటివాళ్ళు. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి తెలుగు వారి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల గత సంవత్సరం నుంచి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించి మే 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకని ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఏఎన్నార్ శతజయంతి ఉత్సావాలు మొదలు కానున్నాయి.

20 సెప్టెంబర్ 1924 కృష్ణ జిల్లాలోని ఓ గ్రామంలో పుట్టిన ఏఎన్నార్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగి హైదరాబాద్ కి సినీ పరిశ్రమకు తరలించిన వారిలో ముఖ్యులుగా నిలిచి అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి ఎన్నో సినిమాలకు, ఎంతోమందికి అవకాశాలు కల్పించి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వచ్చే సంవత్సరం ఆయన 100వ జయంతి కావడంతో ఈ సంవత్సరం నేడు ఆయన పుట్టిన రోజు నుంచి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

నేడు ఉదయం అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

గుడివాడ దగ్గర రామాపురం అనే ఓ చిన్న గ్రామంలో పుట్టిన అక్కినేని చదువు అవ్వగానే సినిమాలంటూనే బయలుదేరారు. 1941లో ధర్మపత్ని అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ చిన్న పాత్ర చేశారు మొదట. అనంతరం 1944లో శ్రీ సీతారామ జననం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నాగేశ్వరరావు. బాలరాజు, కీలు గుర్రం, లైలా మజ్ను సినిమాలతో నాగేశ్వరరావు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వరుసగా సెకండ్ హీరోగా, హీరోగా రోల్స్ చేసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ తో కలిసి పల్లెటూరి పిల్ల, మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, భూకైలాస్.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

అక్కినేని చేసిన దేవదాస్, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం సినిమాలు ఒక క్లాసిక్ లా నిలిచిపోయాయి. బాటసారి, ఆరాధన, కులగోత్రాలు.. లాంటి ఆర్ట్ ఫిలిమ్స్ తీస్తూనే మరో పక్క మాయాబజార్, భూకైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం.. లాంటి పలు పౌరాణికాల్లో నటిస్తూ దసరా బుల్లోడు లాంటి పలు పక్కా కమర్షియల్ సినిమాలు కూడా తీసి ప్రేక్షకులని మెప్పించారు. దాదాపు 250కి పైగా సినిమాలో ఎన్నో రకాల పాత్రలతో మెప్పించారు.

పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్.. మూడు దేశ అత్యున్నత అవార్డులు అందుకున్న ఏకైక తెలుగు నటుడు అక్కినేని. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నంది అవార్డులు, ఎన్టీఆర్ అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డులు, ఇంకా ఎన్నో ప్రైవేట్ అవార్డులు గెలుచుకున్నారు. ఏజ్ పెరిగిన తర్వాత కూడా, గుండె ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా సినిమానే తన ప్రాణమంటూ చివరి క్షణం వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చివరి రోజుల్లో కూడా మనం సినిమాలో నటించి సినిమానే ప్రాణమని సినిమాతోనే తన ప్రాణాన్ని వదిలారు.

Akkineni Nageswara Rao : ఏఎన్నార్ 100వ పుట్టినరోజు.. అక్కినేని విగ్రహావిష్కరణ చేస్తున్న ఫ్యామిలీ..

చెన్నై నుంచి హైదరాబాద్ కి సినీ పరిశ్రమ తరలి వచ్చాక ఎన్నో సినిమాలు షూటింగ్స్ సజావుగా జరుపుకోవడానికి, డబ్బింగ్, ఎడిటింగ్, మిక్సింగ్.. లాంటి టెక్నికల్ అంశాలని కూడా తన స్టూడియో ద్వారా అందించి అన్నపూర్ణ స్టూడియోని అగ్రగ్రామిగా నిలిచేలా చేసారు. నేడు అన్నపూర్ణ స్టూడియో, ఫిలిం స్కూల్ అగ్రపథంలో దూసుకుపోతున్నాయి అంటే అది అక్కినేని నాగేశ్వర రావు గారి ముందుచూపే కారణం. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వర రావు తెలుగు ప్రేక్షకులు ఉన్నంతకాలం ఆయన అందరి మనసుల్లో నిలిచిపోతారు.

ట్రెండింగ్ వార్తలు