PM Modi : వాట్ నెక్ట్స్, రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కేంద్రం అలర్ట్‌ అవుతోంది. వైరస్‌ కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.

COVID-19 Resurgence :  కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కేంద్రం అలర్ట్‌ అవుతోంది. వైరస్‌ కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం ప్రధాని మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడంపైనా చర్చించే అవకాశం ఉంది. వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకోనున్నారు మోదీ. ముఖ్యంగా కరోనా నియంత్రణలో విఫలమవుతున్న రాష్ట్రాలకు మోదీ కీలక సూచనలు చేయనున్నారు.

మరోవైపు…భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే కొత్తగా లక్షా 15వేల 249 కొత్త కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల నుంచి 8 లక్షలకు పెరిగింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కరోనాతో దేశంలో 630మంది బలయ్యారు. నవంబర్ 5 తర్వాత ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. మహారాష్ట్రలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కేసులు శరవేగంతో పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలన్నింటితో కలిపి సుమారు 60 వేల కేసులు వస్తే ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 55 వేల 5వందల కేసులు వచ్చాయి.

వ్యాక్సిన్‌లు కొరత ఏర్పడింది. కేవలం రెండు రోజులకు సరిపడా టీకాలు మాత్రమే తమ వద్ద ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా ఇదే పరిస్థితి. నిన్నటివరకూ పంజాబ్‌, ఢిల్లీలో కరోనా కేసులు భయపెడితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ కూడా ఆ జాబితాలోకి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా దాదాపు పదివేల మంది కరోనా బారిన పడ్డారు. కర్ణాటకలో 6వేల మందికి పైగా కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు